Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ నగరంలోని గడ్డిఅన్నారం మార్కెట్‌ను తాత్కాలికంగా తరలించబోయే బాటసింగారంలో ఎంత మేరకు భూమి ఉందో, భూమి ఎంపికకు ఇచ్చిన నోటిఫికేషన్ వివరాలను శుక్రవారం జరిగే విచారణలో ఇవ్వాలని మార్కెంటింగ్ శాఖను హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకూ మార్కెట్‌ను తరలించొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గడ్డిఅన్నారం మార్కెట్ తరలింపు చర్యలను సమర్ధిస్తూ గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. దీనిని సవాల్ చేస్తూ హోల్‌సేల్ ఫ్రూట్ మార్కెట్ కమీషన్ ఏజెంట్లు, మరో ఇద్దరు వేసిన అప్పీల్ పిటిషన్లపై విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ ఎ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ టి వినోద్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం ప్రకటించింది. 22 ఎకరాల గడ్డిఅన్నారం మార్కెట్‌ను ప్రభుత్వానికి ఇవ్వాలని మార్కెట్ కమిటీ తీర్మానం చెల్లదని, దీనిని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేయాలని అప్పీల్ పిటిషనర్ల న్యాయవాది వాదించారు. గడ్డిఅన్నారంలో సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రి కట్టేందుకే అక్కడి మార్కెట్‌ను పర్మినెంట్‌గా కోహెడ్‌లో ఏర్పాటు చేస్తామని, ఈలోగా అన్ని వసతులను కల్పించిన బాటసింగారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. బాటసింగారంలో వసతులు లేవన్న వాదన సరికాదన్నారు. విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.
వాదనలు విన్నతర్వాతే..హైకోర్టు
రుణాల తీసుకుని చెల్లించలేకపోయినందున దివాలా ప్రక్రియ చేపట్టాలన్న కేసులో పసిఫిక్ ఆస్పత్రి వాదనలు విన్న తర్వాతే తీర్పు చెప్పాలని హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ బెంచ్ ను హైకోర్టు ఆదేశించింది. దివాలా ప్రక్రియ కోసం ఓంకార్ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ వేసిన కేసులో తమ వాదనలు వినకుండానే తీర్పును ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ వాయిదా వేసిందని ఆస్పత్రి వేసిన రిట్‌ను గురువారం జస్టిస్ ఎ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ టి వినోద్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే తీర్పు చెప్పాలని ట్రిబ్యునల్‌ను ఆదేశించింది. ఓంకార్ అస్సెట్ రీకన్‌స్ట్రక్షన్‌కు నోటీసులిచ్చి విచారణను వాయిదా వేసింది.