Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 1000 మంది పోటీ
- సూర్యాపేటలో ఫీల్డ్ అసిస్టెంట్ల భిక్షాటన
నవతెలంగాణ - సూర్యాపేట
ఉపాధిహామీ చట్టంలో 14 ఏండ్లుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను అకారణంగా తొలగించడం అన్యాయమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ అన్నారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేటలో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని సమ్మె చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించటం దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్వహించిన పాత్ర సీఎంకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రకటించిన సీఎం ఇప్పటి వరకూ హామీని అమలు చేయలేదన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షులు వాంకుడోత్ లింగానాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్, కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి పోల బోయిన కిరణ్ కుమార్, నాయకులు అంజద్ అలీ, ధరావత్ వీరన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.