Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితుల హక్కులను హరిస్తున్న పాలకులు
- అడుక్కోవడం కాదు.. ప్రతిఘటన పోరాటాలు చేయాలి: కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్వెస్లీ
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
''హక్కులను హరిస్తే... మళ్లీ వాటి కోసం అడుక్కోవడం కాదు.. ప్రతిఘటన పోరాటాలు చేయాలి. దళితబంధు వంటి సంక్షేమ పథకాల అమలుతోపాటు భూమిలో మన వాటా కోసం పోరాటాలు చేయాలి.. సాంఘిక ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి ఉద్యమించాలని'' కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్వెస్లీ పిలుపునిచ్చారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో కేవీపీఎస్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగు భూమి, ఆర్థిక వనరులకు మనలను దూరం చేసి, మన చేత వెట్టి చూయించుకుంటున్నారని అన్నారు. రాజ్యాంగం అమల్లోకి రాకముందు మనలను బానిసలుగా చూశారని, ఆర్థిక వనరులన్నీ భూస్వాముల కబంధ హస్తాలో ఉండేవని అన్నారు. ఆ తర్వాత రాజ్యాంగం కల్పించిన హక్కులనూ అమలు చేయకుండా పాలకులు దళితులను హక్కులకు దూరంగా ఉంచారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని సైతం నీరుగార్చే విధంగా బాధితులపైనే కేసులు పెడుతున్నారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరులో కమ్యూనిస్టులు లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టారని గుర్తు చేశారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు అడుగుతున్నామని, భిక్షమేమీ కాదని.. హక్కుల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కురుమయ్య, నాయకులు మోహన్, మల్లెల మాణిక్యం రాజు, ఆదివిష్ణు, లక్ష్మిదేవి, పరుషరాములు, వెంకట్రాములు, హన్మంతు పాల్గొన్నారు.