Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెబ్సైట్.. నిరంతర అప్డేట్గా ఉండాలి
- కార్మికులకు సరైన సమాచారాన్ని అందించాలి : సీఐటీయు వెబ్సైట్ ఆవిష్కరణ సభలో ఏకే పద్మనాభన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఐటీయు తెలంగాణ వెబ్సైట్ అనేది కార్మికులకు సంబంధించిన ప్రతి అంశం పట్ల లోతైన పరిశీలన చేస్తూ, అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని సీఐటీయు జాతీయ ఉపాధ్యక్షులు ఏకె పద్మనాభన్ అన్నారు.గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయు రాష్ట్ర కమిటీ వెబ్‌సైట్‌ను ఏకేపీ అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కార్మిక సంఘాల కార్యకలాపాలను, ముఖ్యంగా సీఐటీయు కార్యకలాపాలను జనంలోకి తీసుకెళ్లటానికి సామాజిక మాధ్యమాలు బాగా ఉపయోగపడ్డాయని చెప్పారు. ప్రస్తుతం ప్రారంభించిన వెబ్‌సైట్‌కూడా కార్మిక వర్గానికి తాజా వార్తలను అందజేయాలని కోరారు. సోషల్ మీడియా అనేది ఇప్పుడు మన అవసరమే కాదు..అనివార్యమని చెప్పారు. ప్రస్తుతం ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత సమాచారాన్ని తెలుసుకుంటున్నామని వివరించారు. అయితే..ఇదే సమయంలో ఆయా మాధ్యమాలు ఇచ్చే నిరాధార, అబద్ధపు వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. లేదంటే దాని ద్వారా ఎంత ఉపయోగం జరుగుతున్నదో..అంత నష్టం కూడా వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రధాని మోడీ ఇటీవల అమెరికా వెళ్లొచ్చిన తర్వాత..అక్కడున్న మెయిన్‌స్ట్రీమ్ మీడియా మొత్తం తనను ఆకాశానికి ఎత్తినట్టు ఇక్కడ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయించుకున్నారని గుర్తుచేశారు. వాస్తవంగా అదంతా అబద్దపు ప్రచారమని తేలిపోయిందన్నారు. సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు మాట్లాడుతూ అన్ని యూనియన్లలో ఉన్న కార్మికులందరినీ ఒక వర్గంగా భావించి వారి ఈతిబాధల్ని ప్రతిబింబించే విధంగా ఈ వెబ్‌సైట్‌ను నడుపుతామని చెప్పారు. ఇప్పటికే మన వర్కర్ పత్రికను కూడా ఆ ధృక్ఫథంతో నడిపిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ విధానాలు, కార్మికుల స్థితిగతులు తెలుసుకునేందుకు అందరూ దీన్ని వినియోగించుకునేలా పలు అంశాలు పొందుపరుస్తామన్నారు. కార్మికుల సమ్మెలు, స్కీం వర్కర్ల సమస్యలు, మానిటైజేషన్ ప్రభావం తదితర అంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్గా కార్మికులకు అందిస్తామని చెప్పారు. నయాఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలను ప్రసారం చేయటమేగాక, దేశభక్తియుత వెబ్‌సైట్‌గా దాన్ని రూపొందిస్తామని చెప్పారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ కార్మిక ఉద్యమంలో ఇలాంటి వెబ్‌సైట్‌ను ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించామని గుర్తుచేశారు. ప్రస్తుతం సోషల్‌మీడియా ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. ప్రపంచం, దేశం ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వైపు చూస్తున్నారనీ, ఇలాంటి సమయంలో ఈ వెబ్‌సైట్‌ను తీసుకురావడం హర్షణీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా కన్వీనర్ ఎస్వి రమ, సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి వీఎస్ రావు, రాష్ట్ర కోశాధికారి వంగూరిరాములు, సోషల్ మీడియా ఇన్చార్జి వై సోమన్న, రాష్ట్ర నాయకులు ఎం.నాగేశ్వర్రావు, పి.శ్రీకాంత్, పి.సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.