Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుజాతనగర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలోని గరిపేట గ్రామంలో గురువారం పోడు వివాదం నెలకొంది. చిట్టి రామవరం గ్రామానికి చెందిన 20 మంది రైతులు గరిపేట గ్రామంలో 50 ఎకరాల భూమిని 40 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. గురువారం ఉదయం రామవరం అటవీ రేంజ్ అధికారులు పొలంలో పనులు చేస్తున్న రైతులను అడ్డుకున్నారు. దాంతో రైతులకు అధికారులకు మధ్య తోపులాట, వాగ్వివాదం, ఘర్షణ చోటు చేసుకుంది. ఓ అటవీ అధికారి గొడ్డలితో లక్ష్మి అనే మహిళపై దాడి చేయగా ఆమె స్పృహ కోల్పోయింది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. దాంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాయపడ్డ వారిని 108లో ఆస్పత్రికి తరలించారు. తమ భూములు లాక్కుంటే ఊరుకోమని అధికారులను ప్రాధేయపడ్డారు. అయినా రైతుల పనులను అడ్డుకున్నారు. అడ్డొచ్చిన మహిళలపై అధికారులు దాడులు చేశారని మహిళలు ఆరోపిస్తున్నారు. తమ భూములకు పట్టాలు ఇవ్వాలని అనేక మార్లు అధికారులకు వినతులు ఇచ్చామని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టాలు ఇస్తామన్న హామీ ఇచ్చారనీ, దాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ సంఘటనపై అధికారులు పోడు సాగుదారులు ఒకరిపై ఒకరు టు ఇంక్లైన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.