Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ పార్టీల సమావేశంలో నిర్ణయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నిరుద్యోగం, విద్యారంగ సమస్యలపై శనివారం నుంచి ఉద్యమాలు నిర్వహించాలని రాజకీయ పార్టీలు నిర్ణయించాయి. టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాయి. పోడు సాగుదార్ల సమస్యలపై అక్టోబర్ 5న జాతీయ రహదారుల దిగ్బంధనం, రాస్తారోకోలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాయి. గురువారం గాంధీభవన్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ, టీజేఎస్, టీడీపీ, తెలంగాణ ఇంటిపార్టీ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాసిన 'ప్రభుత్వాల బందీగా ప్రజాస్వామ్యం' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ విద్యార్థి సైరన్ నిర్వహిస్తున్నామనీ, అందుకు మద్దతు ఇవ్వాలని పార్టీలను కోరినట్టు తెలిపారు. అన్ని పార్టీలు నిరుద్యోగ పోరాటానికి మద్దతు పలికాయని చెప్పారు. సమస్యలపై కలిసి పని చేయడానికి పార్టీ నేతలు అంగీకరించారన్నారు. పోడు భూముల సమస్యలపై కలిసి పోరాడతామన్నారు. అక్టోబర్ 5న జరిగే ఆందోళనలో ఉమ్మడిగా ఉద్యమిస్తామన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ధరణి సమస్యలు, పోడు భూముల సమస్యలపై చర్చించినట్టు తెలిపారు. గిరిజనులపై ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు. అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు 400కిలోమీటర్లమేర రహదారులనుదిగ్బంధిస్తామని చేస్తామని చెప్పారు. అటవీ అధికారులు అక్రమ కేసులు, వేధింపులు మానుకోవాలనీ, పోడు భూములకు పట్టాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అడిగిందనీ, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. టీజేఎస్ నేత పీఎల్ విశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడం లేదని విమర్శించారు. ఉద్యోగం రాదనే ఆందోళనతో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు తమ పార్టీ హుజూరుబాద్ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వబోదనీ, అయితే ప్రజా సమస్యలపై కలిసి పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. సీపీఐ(ఎంఎల్)న్యూడెమొక్రసీ నేత కె గోవర్థన్, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ తదితరులు మాట్లాడారు.