Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలం చెల్లుతున్న వైనం
- అవసరానికి ప్రజలకు దొరకని ఔషధాలు
- నాలుగేండ్లుగా ఫార్మసీ సూపర్ వైజర్ పోస్టులు ఖాళీ
- పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ చేస్తున్నఫార్మసిస్టులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లోని డీఎంహెచ్ఓ కార్యాలయాలు, డిఎంఇ పరిధిలోని ఆస్పత్రులు, కాలేజీల్లో 13 ఫార్మాసీ సూపర్ వైజర్ పోస్టులు గత నాలుగేండ్ల నుంచి భర్తీ చేయటం లేదు. దీంతో కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసే మందులపై పర్యవేక్షణ సజావుగా జరగటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరో జోన్లో ఆరుగురు ఫార్మాసిస్ట్ గ్రేడ్ -1 లుగా 2018 డిసెంబర్ లో పదోన్నతి పొందారు. ఇప్పటికే అదే కేడర్లో కొనసాగుతూ పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 ల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఇందులో కొంత మంది సర్వీసు పదోన్నతి లేకుండా 31 ఏండ్లుగా ఒకే కేడర్లో కొనసాతుండటం గమనార్హం. ఫార్మసీ గ్రేడ్-1 లో ఉన్న వారిని ఫార్మసీ సూపర్ వైజర్లుగా నియమిస్తే ఏండ్ల తరబడి పని చేస్తున్న గ్రేడ్-2 లో ఉన్న వారికి పదోన్నతి పొందే అవకాశముంటుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో పని చేసే ఫార్మాసిస్టులకు మెడికల్ స్టోర్లు, ఓపీ ఫార్మసీ, ఇ-ఔషధి, మెడిసిన్ సేకరణ, పర్యవేక్షణ బాధ్యత ఉంది. అయితే ఇప్పుడు చాలా తక్కువగా సిబ్బంది ఉండటంతో పని భారం పెరిగిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త మెడికల్ కాలేజీల్లో పూర్తిస్థాయి ఫార్మసీ గ్రేడ్-1, గ్రేడ్-2తో పాటు ఫార్మసీ సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతుననారు.
మూడేండ్లుగా పెండింగ్
ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ రోగుల సంఖ్య ఆధారంగా పోస్టుల సంఖ్య పెంచాలనీ, బస్తీ దవాఖానాలు, స్టేట్ వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్, జిల్లా వ్యాక్సిన్ స్టోర్లు, మలేరియా, లెప్రసీ స్టోర్లు, డీఎంహెచ్ఓ స్టోర్లలో ఫార్మసీ యాక్ట్ 1948 ప్రకారం ఫార్మాసిస్టు గ్రేడ్-2 పోస్టులను మంజూరు చేయాలని ఫార్మాసిస్టుల అసోసియేషన్లు ప్రభుత్వాన్ని దీర్ఘకాలంగా కోరుతున్నాయి. ఇదే విషయమై ప్రభుత్వం రిమార్క్స్ పంపించాలని కోరినప్పటికీ డీహెచ్ కార్యాలయం నుంచి 36 నెలలు గడిచినా ఒక్క అడుగు ముందుకు పడలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల తీరుతో ఉద్యోగులతో పాటు ప్రజలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, అదే సమయంలో ప్రభుత్వ సొమ్ము వృధా అవుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం పెంచేందుకు ఆ శాఖను ప్రక్షాళన చేస్తామని సీఎం కేసీఆర్, మాజీ ఆరోగ్యశాఖ మంత్రులు పదే పదే ప్రకటించినప్పటికీ సమస్యలు స్వాగతం చెబుతూనే ఉన్నాయి. నిర్ణయాలు తీసుకోవటంలో చోటు చేసుకుంటున్న జాప్యం కాస్తా ప్రజల్లో విశ్వాసం పెంచటం మాట ఏమో గానీ, ఉద్యోగుల్లో అసహనాన్ని పెంచుతోంది.
పదోన్నతులు కల్పించాలి : కుర్మ శంకర్
అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పించాలని గవర్నమెంట్ ఫార్మాసిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు కుర్మ శంకర్ కోరారు. డీఎంఇ, డీహెచ్, వైద్యవిధాన పరిషత్ విభాగాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏండ్ల తరబడి పని చేస్తున్న ఫార్మాసిస్టులకు తగిన గుర్తింపు రావటం లేదనే భావన తొలగించాలని విజ్ఞప్తి చేశారు. పదోన్నతుల ప్రక్రియ మొదలు పెడితే గ్రేడ్ వన్లో ఉన్న వారికే కాకుండా గ్రేడ్ 2 లో ఉన్న వారికి న్యాయం జరుగుతుందనీ, మందులపై పర్యవేక్షణ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.