Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీ సమావేశాలపై 'హుజూరాబాద్' ప్రభావం
- అధికార పార్టీ వర్గాల్లో చర్చ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మూడు రోజుల విరామం అనంతరం రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. అయితే హుజురాబాద్ ఉపఎన్నిక ప్రభావం వీటిపై పడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రభుత్వం సమావేశాలను కుదించే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. వర్షాల నేపథ్యం లో ఇప్పటికే మూడురోజుల పాటు సమావేశాలను వాయిదా వేసిన సర్కారు శుక్రవారం పలు బిల్లులకు ఆమోదం తెలిపి, ఆతర్వాత ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేసేం దుకు ఇప్పటికే నిర్ణయించిందని సమాచారం. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్తో రాజకీయ వర్గాల్లో గందరగోళం నెలకొన్నది. ఈ క్రమంలో దాదాపు ఆర్నెల్ల విరామానంతరం ప్రారంభమైన అసెంబ్లీ పూర్తి స్థాయిలో కొనసాగే లోపే నిరవధికంగా వాయిదా పడే అవకాశం కనిపిస్తున్నది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం, హుజురాబాద్ నోటిఫికేషన్ను ముందే ఊహించి ఉంటారనే చర్చ కొనసాగుతున్నది. అందువల్ల ఆయన ఇప్పుడు సమావేశాలను ముగించి, ఎన్నికల హడావుడిలో పడే అవకాశముందని సమాచారం. మరోవైపు ఉభయ సభలు శుక్రవారం తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో గృహ నిర్మాణం, ఉద్యానవన విశ్వ విద్యాలయం, పంచాయతీరాజ్, నల్సార్ చట్ట సవరణకు సంబంధించిన నాలుగు బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. అనంతరం శాసనసభ, మండలి నిరవధికంగా వాయిదా పడే అవకాశాలున్నాయి. అయితే సభలను కొనసాగించాలా..? వద్దా..? అనేది పూర్తిగా సీఎం నిర్ణయంపైన్నే ఆధారపడి ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో జరిగిన పలు ఉప ఎన్నికల సందర్భంగా కేసీఆర్... అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలపై విరుచుకుపడిన దాఖలాలున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సైతం ఆయన ఆ సమయంలో పలుమార్లు ఏకరువు పెట్టటం ద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించి, సఫలీకృతులయ్యారు. ఇప్పుడు కూడా సీఎం అదే రకంగా ఆలోచించినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు వ్యాఖ్యానిస్తుండటం కొసమెరుపు.