Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం
- మొట్టమొదటి కాంగ్రెస్ జెండా భూపాలపల్లి గడ్డపైనే!
- రమణారెడ్డి కుటుంబానికి రాజకీయ మరణశాసనం : భూపాలపల్లి బహిరంగ సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
నవతెలంగాణ- భూపాలపల్లి
ఆరు దశాబ్దాల ఉద్యమం పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలతో నీళు, నిధులు, నియమాకాల కోసం.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో.. అవన్నీ ఏమయ్యాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనీ, మొట్టమొదటి జెండా భూపాలపల్లి గడ్డపై ఎగురుతుందన్నారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంగడి మైదా నంలో గురువారం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ప్రకాశ్‌రెడ్డి అధ్యక్ష తన జరిగిన భారీ బహిరంగ సభలో రేవంత్ పాల్గొని మాట్లా డారు. ముందుగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయ కులు గండ్ర సత్యనారాయణ రావుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన, గిరిజనుల బతుకులు బాగుపడతాయన్న నమ్మకంతో తెలంగాణలో మువ్వన్నెల జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారని అన్నారు. సభకు వచ్చిన కార్యకర్తలు, ప్రజలను చూసి ఆయన మాటల్లో జోష్ పెంచారు. భూపాలపల్లి తనకు కొత్త కాదనీ, ఇప్పుడు పార్టీలో చేరిన సత్యన్న తనకు చాలా సన్నిహితుడనీ, అతనితో కలిసి ఓపెన్ కాస్ట్ గనులకు వ్యతిరేకంగా, రైతులు, ప్రజలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేయడం జరిగిందని గుర్తుచేసుకున్నారు. దసరా, దీపావళి అని చూడకుండా సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మెలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించారనీ, అయినా వారి సమస్యలు పరిష్కరించని సీఎం కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయన్నారు. భూపాలపల్లి జిల్లాలోనే కాకుండా ఆదిలాబాద్, కొత్తగూడెం సింగరేణి ఏరియాల్లో ఓపెన్ కాస్టుల పేరుతో బొందల గడ్డగా మారిస్తే గాలి, నీరు కలుషితమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. అనంతరం రెండుసార్లు అత్యధిక మెజార్టీతో ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కడితే.. తండ్రీకొడుకులు, కూతురు అల్లుడు, సడ్డకుడు కొడుకు రాజ్యమేలుతున్నారని ఆరోపించారు. వేలకోట్ల పెట్టుబడులు, లక్షల కోట్ల రూపాయలను దండుకోవడంతోపాటు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని ఆరోపించారు. భూపాలపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ప్రతి కార్యకర్త అహర్నిశలు శ్రమించి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి గెలిపిస్తే.. ఆయన భార్య జ్యోతికి జడ్పీ చైర్మెన్ పదవితో పాటు తన సంపాదన, కోట్ల ఆస్తులను కాపాడుకోవడం కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరారని విమర్శించారు. గాలి, నీరు, ఇసుక, బొగ్గు, మట్టి ఇలా సహజ వనరులను అక్రమ రవాణా చేస్తూ ప్రజల అభివృద్ధి మరిచిన రమణారెడ్డి కుటుంబానికి ఇక రాజకీయ మరణశాసనం రాయబోతున్నదని చెప్పారు. జిల్లాలోని కుమ్మరిపల్లిలో ఆయిల్ పామ్ ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు చెందిన భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ, ప్రభుత్వ కార్యాలయాలు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారమనీ, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మొట్టమొదటి జెండా భూపాలపల్లి గడ్డపైనే ఎగరడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ బహిరంగ సభలో ప్రచార కమిటీ చైర్మెన్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, పార్లమెంట్ ఇన్చార్జి మాజీ మంత్రి ఈ. చంద్రశేఖర్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, మాజీ కేంద్రమంత్రి ఈ. బలరాంనాయక్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యే పోదం వీరయ్య, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, వేం నరేందర్ రెడ్డి, వరంగల్ పార్లమెంటు ఇంచార్జి దొమ్మటి సాంబయ్య, జిల్లా పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.