Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బంధు పథకంలో 25శాతం కేటాయించాలి
- డబుల్ బెడ్ రూం ఇండ్లల్లో 5శాతం ఇవ్వాలి : ఎన్పీఆర్డీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల బంధు పథకం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ సంఘం రాష్ట్ర విస్తృత సమావేశాలు సెప్టెంబర్ 28-30 తేదీల్లో మెదక్ పట్టణంలో జరిగాయని తెలిపారు. ఈ సమావేశాల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తీర్మానాలు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని, దళిత బంధు పథకంలో వికలాంగులకు 25 శాతం అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి పెండింగ్లో ఉన్న ఆసరా పింఛన్లు వెంటనే మంజూరు చేయాలనీ, 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని ప్రభుత్వ శాఖలన్నీ పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించి భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలనీ, రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగ నియామకాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్మిస్తున్న మోడల్ మార్కెట్లలో, షాపుల కేటాయింపుల్లో 5 శాతం వికలాంగులకు కేటాయించాలనీ, తీవ్ర వైకల్యం కలిగిన వారి సహాయకులకు ప్రత్యేక అలవెన్సులు చెల్లించాలనీ, ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు జాబ్ కార్డు ఇచ్చి 150 రోజులు పని దినాలు కల్పించాలని కోరారు.
ఎన్పీఆర్డీ గౌరవ అధ్యక్షులు ఎం జనార్దన్ రెడ్డి ఎన్నిక
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఎం జనార్దన్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా లక్ష్మీ (సిద్దిపేట) ఆరిఫా (ఆదిలాబాద్)ను విస్తృత సమావేశంలో ఎన్నుకున్నారు.