Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2006 ఆదివాసీ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి
- సాగుదార్లపై నిర్భందాన్ని నిలిపివేయాలి
- మంత్రి సత్యవతి రాథోడ్‌కు వ్యకాస వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సాగులో ఉన్న పోడు హక్కుదారులకు ఎఫ్ఆర్సీ కమిటీలు వేసి హక్కు పత్రాలను ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు జి.నాగయ్య, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి ప్రసాద్, ఆర్ వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బి పద్మ, రాష్ట్ర నాయకులు ఆర్ ఆంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం పోడుభూముల మంత్రి వర్గ ఉప సంఘం చైర్మెన్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. 2006 ఆదివాసీ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని కోరారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం వామపక్షాల కృషితో వచ్చిందని తెలిపారు. ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని వివరించారు. క్షేత్ర స్థాయి కమిటీలు ఏర్పాటు కాకపోవటంతో అటవీ హక్కుల గుర్తింపు లక్ష్యం నెరవేరడం లేదని తెలిపారు. రాష్ట్రంలో13లక్షలకు పైగాఎకరాల్లో పోడు వ్యవసాయం జరుగుతున్నదనీ, రెండు లక్షలకు పైగాపోడు రైతులు హక్కు పత్రాలకోసం దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.కానీ..1,00,247 మందికి 8,46,773 ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇచ్చారని తెలిపారు. ఇంకా 1,15,495 మందికి సుమారు 5లక్షల ఎకరాలకు పట్టాలివ్వాలని చెప్పారు. హక్కుపత్రాలు లేకపోవడంతో పోడు సాగుదార్లకు ప్రభుత్వ పథకాలు అందడంలేదనీ, రైతుబంధు, రైతుబీమా,పంటరుణాలు,రుణమాఫీ అమలు కావడంలేదని తెలిపారు. పంటలు అమ్ముకునే సందర్భంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు చెప్పారు. అభివృద్ధి పేరుతో షెడ్యూల్ ఏరియాలో ఉన్న భూములను ప్రభుత్వం సేకరించవద్దని చైర్మెన్‌ను కోరారు.