Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
నవతెలంగాణ- బీబీనగర్
రానున్న రోజుల్లో ఆధునిక వైద్యరంగంలో బీబీనగర్ ఎయిమ్స్ కేంద్ర బిందువుగా మారుతుందని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ అకడమిక్ సెక్షన్ ప్రారంభోత్సవానికి శుక్రవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. 2003లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దూరదృష్టితో సురక్ష యోజన కింద ఎయిమ్స్ వైద్యకళాశాలను ప్రకటించారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వారికి ఆధునిక వైద్య సేవలు అందించే ముఖ్య ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ 200 ఎకరాల్లో ఎయిమ్స్ వైద్య కళాశాలను మంజూరు చేశారని చెప్పారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఎయిమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఏడేండ్ల కిందట దేశంలో ఎనిమిది ఎయిమ్స్ కళాశాలలు మాత్రమే ఉన్నాయన్నారు. నేడు దేశవ్యాప్తంగా 25 ఎయిమ్స్ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కోవిడ్ సమయంలో బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ భాటియా ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది అందించిన వైద్యసేవలు అద్భుతమని అభినందించారు. ఎయిమ్స్ ప్రాంగణంలో ఎంపీతో కలిసి దత్తాత్రయ మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీన్ డాక్టర్ రాహుల్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీరజ్ అగర్వాల్, భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి, బీజేపీ నాయకులు గూడూరు నారాయణరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పొట్టోళ్ల శ్యామ్‌గౌడ్, పంజాల రామాంజనేయులుగౌడ్, గోళి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.