Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రం ఏర్పడే నాటికి దేశ జీడీపీలో తెలంగాణ జీఎస్డీపీ 4.06 శాతంగా ఉండేదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. గత ఏడేండ్ల నుంచి వరుసగా పెరిగిన అది.. ఇప్పుడు 4.97 శాతానికి చేరిందని ఆయన వెల్లడించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడుతూ... మనదేశ ప్రగతి రేటు కంటే తెలంగాణ ప్రగతి రేటు ఎక్కువగా ఉందని వివరించారు. ఒకరకంగా దేశాన్ని ... తెలంగాణ పోషిస్తోందని వెల్లడించారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు త్వరలోనే టెండర్లను పూర్తి చేసి, పనులను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆయా పథకాలకు శంకుస్థాపనలు చేస్తామని వివరించారు.
మరిన్ని కేజీబీవీలు : సబిత
రాష్ట్రంలో మరిన్ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీలు)ను ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నదనీ, ఇందుకుగల అవకాశాలను పరిశీలిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శాసనసభలో తెలిపారు. ఆదర్శ పాఠశాలలు ఇంటర్మీడియట్ వరకు పని చేస్తున్నాయని పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఆయా పాఠశాలల్లో సరిపడా మౌలిక సదుపాయాలు ఉన్నాయని ఆమె వివరించారు. అడవుల పరిరక్షణ, చెట్ల పెంపకానికి వీలుగా రాష్ట్రంలో హరిత నిధిని ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటం పట్ల అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
సమస్యల వెల్లువ...
శుక్రవారం శాసనసభ జీరో అవర్‌లో పలువురు సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించారు. కాంగ్రెస్‌కు చెందిన మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, ఎంఐఎంకు చెందిన జాఫర్ హుస్సేన్, పాషాఖాద్రీ, మోజం ఖాన్, బీజేపీ సభ్యుడు రఘునందనరావుతోపాటు అధికార పార్టీకి చెందిన సభ్యులు... సమస్యలను ప్రస్తావించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.