Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌లో ముగ్గురిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు అకాడమీ ఉద్యోగులు, బ్యాంక్ అధికారులతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మెర్కాంటైల్ కోఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అధికారులను విచారించారు. ఈ క్రమంలో తెలుగు అకాడమీ నిధుల గల్లంతు వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. గల్లంతైన నిధుల మొత్తం పెరుగుతోంది. అకాడమీకే చెందిన మరో రూ.17 కోట్లు గల్లంతైన విషయం బయటకు వచ్చింది. హైదరాబాద్‌లోని కార్వాన్ యూనియన్ బ్యాంకు శాఖలో గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జులై వరకూ పలు విడతలుగా రూ.43 కోట్లు గల్లంతైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బ్యాంకుకు చెందిన సంతోషనగర్ బ్రాంచ్‌లో రూ.8 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా జులై, ఆగస్టు నెలల్లో గల్లంతయ్యాయి. కెనరా బ్యాంకు నుంచి మరో రూ.9 కోట్లను కూడా దారి మళ్లించి కాజేశారు. దాంతో, మొత్తం కుంభకోణం విలువ రూ.60 కోట్లకు చేరుకుంది. తప్పుడు ఐడీలను సమర్పించి ఖాతాలు తెరిచిన అధికారులు దాదాపు రూ.60 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు దారిమళ్లించారని గుర్తించారు. దాంతో ఆంధ్రప్రదేశ్ మెర్కాంటైల్ కో ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ బీవీవీఎన్ సత్యనారాయణ రావు, మేనేజర్ (ఆపరేషన్స్) వేదుల పద్మావతితోపాటు అదే సంస్థకు చెందిన రిలేషన్షిప్ మేనేజర్ సయ్యద్ మొయినోద్దీన్ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు మరో రెండు కేసుల్లోనూ నిందితులుగా ఉన్నారని జాయింట్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు.