Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు సందర్భంగా గందరగోళం
- తడబడిన మంత్రి ఎర్రబెల్లి... వివరించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి
- తీవ్ర అభ్యంతరం తెలిపిన అక్బరుద్దీన్ ఓవైసీ
- అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శాసనసభలో ఆరుబిల్లులకు శుక్రవారం ఆమోదం లభిం చింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు సందర్భంగా సభ లో గందరగోళం నెలకొంది. ఎంఐఎం, కాంగ్రెస్ సభ్యుల ప్రశ్న లతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తడబడ్డారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. గ్రామపంచాయతీల పేర్ల మార్పు సవరణపై ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యం తరం తెలిపారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో అసలు చట్టంలో ఏముందనే అంశాన్ని అధికారులను అడిగి మరీ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలు సుకున్నారు. గందరగోళం నడుమనే ఆ బిల్లును సభ ఆమోదిం చింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో షెడ్యూల్ 8లో పేర్కొన్న గ్రామాల విస్తరణ, పేర్లు, వార్డు మెంబర్లు ఖర్చుల వివరాలకు సంబంధించిన సవరణ బిల్లును మంత్రి ఎర్రబెల్లి ప్రతిపాదించారు. సభలో ప్రవేశపెట్టిన తర్వాత 30 వర్కింగ్ డేస్ తర్వాత ఆమోద ముద్ర పడుతున్నదనీ, ఇలా జరగాలంటే ఒక్కోసారి రెండుమూడేండ్లు పడుతున్నదని తెలిపారు. ఈ సందర్భంగా అక్బర్దుదీన్ జోక్యం చేసుకుంటూ..పేర్ల మార్పిడిని వ్యతిరేకించారు. దీనిని ఆసరా చేసుకుని కామారెడ్డి, కరీంనగర్, హైదరాబాద్, ఇలా అన్ని చారిత్రాత్మక ప్రాంతాల పేర్లు ఇష్టమొచ్చినట్టు మార్చే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు బిల్లుకు మద్దతు తెలిపారు. తెలంగాణ పురం గ్రామం పేరు తెల్లాపూర్‌గా, ఈశ్వరాపురం పేరు ఇస్మాయిల్ఖాన్పేటగా మార్పునొందాయనీ, అలాంటి వాటి పేర్లను తిరిగి మార్చాలని సూచించారు. సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ.. ఈ పేర్ల మార్పు భవిష్యత్‌లో అనేక సందేహాలకు దారితీయొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 32వేల మంది వార్డు మెంబర్లు తమ పదవులను కోల్పోయే ప్రమాదం ఉందనీ, ఈ నేపథ్యంలోనే ఈ బిల్లును తెస్తున్నామనీ, దీనికి అందరూ మద్దతు తెలపాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సభ్యులను కోరారు. చివరకు ఆందోళన మధ్యనే బిల్లుకు ఆమోదముద్రపడింది.
తెలంగాణ గృహ నిర్మాణ మండలి సవరణ బిల్లుకు ఆమోదం
రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ గృహ నిర్మాణ మండలి సవరణబిల్లును ప్రవేశపెట్టారు. భట్టివిక్కమార్క, అక్బరుద్దీన్, శ్రీధర్‌బాబు, జాఫరుద్దీన్ పలువురు సూచనలు చేశారు. ఏపీ హౌసింగ్‌బోర్డు పేరు తెలంగాణ హౌసింగ్బోర్డుగా మారనుంది. గృహనిర్మాణ బోర్డు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలనీ, ఇండ్లు లేనివారికి ప్లాట్లు కేటాయించాలనీ, నాగోల్, తదితర ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు ఇవ్వాలనీ, మైనార్టీలకు 10 శాతం కేటాయించాలనే డిమాండ్లకు మంత్రి అంగీకరించారు. ఈబిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
నల్సార్ చట్ట సవరణ బిల్లు- (2021)ను ప్రవేశపెట్టిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో స్థానిక విద్యార్థు లకు 25 శాతం సీట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, మహిళలకు రిజర్వేషన్ల ప్రకారం కోటా సీట్లు కేటా యించేలా శాసన సభలో నల్సార్ చట్ట సవరణ బిల్లు ను న్యాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఈబిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. 1998 నల్సార్ చట్టంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేరును సాంకేతికంగా తెలంగాణ హైకోర్టుగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ సవరణ బిల్లు, తెలంగాణ రాష్ట్ర పర్యాటకులపై, ప్రయాణికులపై దళారీతనం, దుష్ప్రవర్తను నివారించు బిల్లు, తెలంగాణ వస్తువుల, సేవల పన్ను సవరణ బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.