Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల నిర్లక్ష్యం వల్లే మణికొండలో వ్యక్తి గల్లంతు
- కాంట్రాక్టర్ల బిల్లుల పెండింగ్ వాస్తవమే
- హైదరాబాద్ రోడ్లన్నీ సీఆర్ఎంపీ పరిధిలోకి : కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ హైదరాబాద్‌లో నాలాలు ఆక్రమణకు గురయ్యాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. కేటీఆర్ దీనికి సమాధానమిస్తూ వర్షం నీరు వస్తే రోడ్డుకు కొట్టుకుపోతుందన్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల అతి వర్షాలు, కుంభవృష్టిని తట్టుకునే పరిస్థితి ఏ నగరానికి లేదని చెప్పారు. అకాల వర్షాలకు ఇటీవల న్యూయార్క్ నగరం జలమయమైందని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 9 వేల కిలోమీటర్ల రోడ్లున్నాయనీ, ఇందులో 1,100 జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారులున్నాయని వివరించారు. 2018-19లో కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం (సీఆర్ఎంపీ) ప్రారంభమైందని చెప్పారు. ప్రధాన రహదారులనే సీఆర్ఎంపీ పరిధిలోకి తెచ్చామన్నారు. ఐదేండ్ల వరకు రోడ్డు బాధ్యత ఆ కాంట్రాక్టర్లదేనని స్పష్టం చేశారు. మంచి ఫలితాలనిస్తున్నదని అన్నారు. అందుకే హైదరాబాద్‌లోని రోడ్లన్నింటినీ సీఆర్ఎంపీ పరిధిలోకి తేవాలని ప్రతిపాదన ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో లేవని చెప్పారు. ఆ తర్వాత బిల్లులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. మణికొండలో రజినీకాంత్ అనే వ్యక్తి చనిపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశామన్నారు. అతడు గల్లంతు కావడంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని అన్నారు. రజినీకాంత్ కుటుంబానికి రూ.5 లక్షలు ఇచ్చామనీ, మరో రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని వివరించారు. ఈ ఏడేండ్లలోనూ నాలాలు కబ్జాకు గురయ్యాయని చెప్పారు. అందుకే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ)ని ప్రారంభించామన్నారు. నాలాలు ఆక్రమణ కాకుండా, హైదరాబాద్ జలమయం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. పటాన్చెరు, రాయదుర్గం డివిజన్లను స్వయంగా తాను పర్యటిస్తాననీ, అవసరమైన నిధులు మంజూరు చేస్తానని చెప్పారు.
చిన్న వానకు రోడ్లన్నీ జలమయం : జీవన్‌రెడ్డి
చిన్న వానకు హైదరాబాద్‌లో రోడ్లు, కాలనీలు జలమయం అవుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి అన్నారు. డ్రైనేజీ వ్యవస్థతోపాటు రోడ్లను మెరుగుపర్చాలని కోరారు. వర్షాల వల్ల రోడ్ల మీద గుంతలు పడుతున్నాయనీ, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.
ఆ గుంతలను పూడ్చినా ఆశించిన ఫలితాలు రావడం లేదన్నారు. వనస్థలిపురంలో ఇద్దరు కార్మికులు డ్రైనేజీ పూడ్చుతూ చనిపోయారని అన్నారు. మణికొండలో రజినీకాంత్ అనే వ్యక్తి కొట్టుకుపోయారని గుర్తు చేశారు. హైదరాబాద్ విశ్వనగరంగా మారాలంటే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థకు మెరుగుపర్చేందుకు నిధులు కేటాయించాలని కోరారు. ఏటా రూ.10 కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.50 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటిని చెల్లించాలని చెప్పారు. కార్మికుల కుటుంబాలతోపాటు రజినీకాంత్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.5 వేల కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు చెప్పారు. ప్రొటెం చైర్మెన్ భూపాల్‌రెడ్డి కల్పించుకుని జీహెచ్ఎంసీలో 111, 112, 113 డివిజన్లలో చెరువుల్లో నీరు ఎక్కువై కాలనీల్లోకి వస్తున్నాయని అన్నారు. దుర్గంధం వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ, చెరువులు పాడవుతున్నాయని వివరించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ను ఆదేశించారు.