Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిస్టులనుద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు
- సీఐటీయూకు పని లేకుండా చేశాం
- మండలిలో ఐటీ, పరిశ్రమల అభివృద్ధిపై చర్చ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
''కాలానుగుణంగా వస్తున్న మార్పులకు తగినట్టు కమ్యూ నిస్టులు మారాలి. గతి తార్కిక భౌతికవాదానికి కాలం చెల్లిం దని తెలిసి కూడా మూస పద్ధతిని వీడకపోతే కాలగర్భంలో కలిసిపోతారు. అది కేరళ అయినా, రష్యా, చైనా, అమెరికా అయినా మారిన పరిస్థితులకు అనుగుణంగా విధానాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చైనాలో వర్షం పడితే ఇక్కడ గొడుగు పట్టుకుంటారు. ఇండ్ల ధరలు పెరిగాయంటున్నారు. సామాన్యుల కొనుగోలు శక్తి పెరిగిన నేపథ్యంలోనే అవి పెరిగాయి. అది తప్పెలా అవుతుంది?. మీ పిల్లలకేమో కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కావాలి. కానీ ఆ కంపెనీలకు మాత్రం భూములివ్వొద్దు. ఇది వారి విధానం. సీఐటీయూకు పని లేకుండా చేశాం. అందుకు మమ్మల్ని అభినందించాలి. కార్మికులనే యజమానులుగా చేస్తున్నాం. మాతో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వస్తే చూపిస్తా. చైనాలో పరిశ్రమల కోసం 70-80 వేల ఎకరాలను సేకరిస్తున్నారు. చైనాకదా. భూమి ఇవ్వాలంటే ఇవ్వాలి. మనది ప్రజాస్వామ్య దేశం కదా. ఇక్కడ మాత్రం వద్దా? చైనాకు నర్సిరెడ్డి వస్తే తీసుకెళ్లి చూపిస్తానని'' రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. శాసనమండలిలో శుక్రవారం ఐటీ, పారిశ్రామికాభివృద్ధిపై లఘు చర్చ జరిగింది.
ఈ చర్చలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ తదితరులు పాల్గొన్నారు. చర్చను ప్రారంభించిన భాను ప్రకాష్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నాయని విమర్శించారు. ఒకవైపు ఉద్యోగాలు కల్పించమంటూనే మరోవైపు పరిశ్రమలకు భూములు సేకరించకుండా అడ్డుపడుతున్నాయనీ, గత యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం కూడా దీనికి అడ్డంకిగా మారిందని తెలిపారు. రాజకీయ విబేధాలు ఉండటంతో కైటెక్స్ సంస్థ అధినేతపై కేరళ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందనీ, దీంతో ఆయన కేరళను వదిలిపెట్టారని తెలిపారు. పలు రాష్ట్రాలు, దేశాలు ఆయనతో పెట్టుబడులు పెట్టించేందుకు పోటీ పడినప్పటికీ, మంత్రి కేటీఆర్ చొరవతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని తెలిపారు.
మానవాభివద్ధి సూచికలో కేరళ స్థానానికి
తెలంగాణ రావాలి : అలుగుబెల్లి నర్సిరెడ్డి
మానవాభివృద్ధి సూచికలో కేరళ ఏ స్థానంలో ఉందో తెలంగాణ కూడా ఆ స్థానానికి రావాలని కోరుకుంటున్నట్టు అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. కార్మికులను ఇబ్బంది పెడుతూ జరిగే అభివృద్ధి అభివృద్ధే కాదని అభిప్రాయపడ్డారు. మనిషి కేంద్రంగా అభివృద్ధి జరగాలని సూచించారు. కోట్లాది రూపాయల పెట్టుబడి వచ్చిందనే దాని కన్నా ఏ మేరకు ఉపాధి అవకాశాలు లభించాయో గమనించాలన్నారు. 20-30 ఏండ్లలో ఐటీ ఉద్యోగుల జీతాలు తగ్గాయని తెలిపారు. పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. పోచంపల్లి, బీబీనగర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో పంటలు పండటం లేదనీ, ముచ్చెర్ల ఫార్మారంగం ఎంత అభివృద్ధి చెందుతున్నదో ఆ పక్కన అంతే కాలుష్యం ఉంటున్నదని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలను బయటికి వదులుతున్నారనీ, కార్మికులు దీర్ఘకాలం ఎక్స్పోజ్ అవుతున్నారని తెలిపారు. జీరో లిక్విడ్ డిశ్చార్జ్‌ను బయటికి వదిలేస్తున్నారని చెప్పారు. ఉద్యోగులకు ఎనిమిది గంటల పని వేళలు అమలయ్యేలా చూడాలని కోరారు. 62 రకాల పరిశ్రమల్లో వేతన సవరణ జీవోలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం నాలుగు జీవోలనే ఇచ్చారని తెలిపారు. ఆ నాలుగు కూడా గెజిట్ చేయకపోవటంతో అమలు కావటం లేదన్నారు.
మంత్రి సమాధానమిస్తూ, ఎప్పుడో ఏదో జరిగింది కాబట్టి మళ్లీ అలాగే జరుగుతున్నట్టు మాట్లాడటం సరికాదన్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరణలో చూపిస్తున్నదని తెలిపారు. పరిశ్రమలకు అనుమతిచ్చామే తప్ప....కార్మికులను ఎక్స్పోజ్ చేయమని చెప్పలేదన్నారు. ఎక్కడైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే సరి చేస్తామని చెప్పారు