Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీలో కేసీఆర్.. మండలిలో కేటీఆర్
- ప్రతిపక్షాలపై సీఎం, మంత్రి అసహనం
- స్పీకర్‌తో సీతక్క వాగ్వాదం, ఆవేదన
- ఏది పడితే అది మాట్లాడొద్దంటూ సీఎం సూచన
- ఆరు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
- ఉభయ సభలు సోమవారానికి వాయిదా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అధికారంలో ఉన్న వారు సహజంగా సహనంతో ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. చట్టసభల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు ఓపిగ్గా, సహనంతో సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంటుంది. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో సీఎం, కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసుకోగా, మండలిలో మున్సిపల్ మంత్రి... వామపక్షాలను, ముఖ్యంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిని లక్ష్యం చేసుకుని ఎదురుదాడి చేశారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన పలు అంశాలు, సర్పంచుల సమస్యలపై శుక్రవారం అసెంబ్లీలో హాట్ హాట్ చర్చ నడిచింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మధ్య కాసేపు వాగ్వాదం నడిచింది. విపక్షాల తీరుపై సీఎం కేసీఆర్ గరం గరం అయ్యారు. తీరు మార్చుకోవాలంటూ సూచించారు. ఏది పడితే అది మాట్లాడితే సరిపోదంటూ హెచ్చరించారు. 'ఇది శాససనభ, బయట ఫ్లాట్ ఫామ్ కాదు...' అని వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఒక్కసారిగా గంభీర వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థ.. కూలీలను పీల్చి పిప్పి చేసిందంటూ కామెంట్ చేసిన ఆయన, ఆ కారణంతోనే ఆ వ్యవస్థను రద్దు చేశామని స్పష్టం చేయటం గమనార్హం. ఆ తర్వాత హరితహారంపై చేపట్టిన లఘు చర్చలో సైతం...'పోడు భూముల సమస్యపై ఇక నాన్చేది లేదు...' అంటూనే మరోసారి ఆ అంశాన్ని పక్కకు నెట్టేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు శాసనమండలిలో పరిశ్రమల రంగంపై చర్చ సందర్భంగా కేటీఆర్... కమ్యూనిస్టు పార్టీలపై విరుచుకుపడ్డారు. తీరు మార్చుకోకపోతే కాలగర్భంలో కలిసిపోతారంటూ వ్యాఖ్యానించారు. కేరళ, చైనా ప్రస్తావన తీసుకొచ్చిన ఆయన... అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ వామపక్షాలపై ఆక్రోశం వెళ్లగక్కారు. ఇక అసెంబీల్లో శుక్రవారం ఆరు బిల్లులకు ఆమోదముద్ర పడింది. శనివారం గాంధీ జయంతి, ఆ తర్వాత రోజు ఆదివారం సెలవు దినం కావటంతో ఇటు శాసనసభ, అటు శాసనమండలి సోమవారానికి వాయిదా పడ్డాయి.