Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త యూజర్ ఫీజుల అమలు
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి విమానయాన రాకపోకలు సాగించే ప్రయాణికులపై మరింత భారం పడనుంది. ఇక్కడి రాజీవ్‌గాంధీ అంత ర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జిఎంఆర్ యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యుడిఎఫ్)ను పెంచుకునేందుకు ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఎఆర్ఇఎ) అనుమతించింది. పెంచిన ఛార్జీలు 2022 ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకులు అధిక చార్జీలు పడనున్నాయి. ఎఆర్ఇఎ ఉత్తర్వుల ప్రకారం.. దేశీయ ప్రయాణీకుల యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యుడిఎఫ్) ప్రస్తుతం రూ.281గా ఉంది. ఇది 2022 ఏప్రిల్ 1 నుంచి రూ.480కి చేరనుంది. అంతర్జాతీయ ప్రయాణీకుల ఛార్జీ రూ.393 నుంచి రూ.700కు పెరగనుంది. క్రమేపీ పెంచుతూ 2025 డిసెంబర్ 31నాటికి దేశీయ ప్రయాణీకుల నుంచి రూ.750, అంతర్జాతీయ ప్రయాణీకుల నుంచి 1,500 యుడిఎఫ్‌ను వసూలు చేయడానికి జిఎంఆర్‌కు అవకాశం కల్పించింది. యుడిఎఫ్ ఛార్జీలను పెంచుకోవడానికి అనుమతివ్వాలని ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యూలేటరీ అథారిటీకి జిఎంఆర్ గ్రూపు ప్రతిపాదించిన సమయంలోనే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ వ్యతిరేకించింది. చార్జీలను పెంచకుండా చూడాలని ఎఇఆర్ఎను ఎఫ్ఐఎ రెండు నెలల క్రితమే అభ్యర్తించింది. ఎఫ్ఐఎలో ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్ సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇప్పటికే కరోనా దెబ్బతో పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉందని.. యుడిఎఫ్ ఛార్జీలు పెంచితే ప్రయాణికులపై భారం పడుతుందని, దీంతో డిమాండ్ తగ్గుతుందని ఎఫ్ఐఎ ఆందోళన వ్యక్తం చేసింది. అయినా ఎఆర్ఇఎ యుడిఎఫ్‌ను పెంచుకోవడానికి వీలు కల్పించడం గమనార్హం.