Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా తెలంగాణ ప్రభుత్వం సైతం అగ్రిగోల్డ్ బాధితులకు ఆర్థిక సహాయం చేస్తుందా?అని హైకోర్టు వివరణ కోరింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖరరెడ్డి, జస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ పేరుతో బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బు నుంచి తనకు రావాల్సిన డబ్బును విడుదల చేయాలని సిన్హా అనే బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. తాను రిటైర్ అయిన తర్వాత వచ్చిన రూ.26 లక్షల కష్టార్జితం అగ్రిగోల్డ్‌లో డిపాజిట్ చేసి నష్టపోయానని చెప్పారు. అగ్రిగోల్డ్ నుంచి డబ్బు రాకపోవడంతో తన భార్యకు క్యాన్సర్ చికిత్స చేయించలేకపోయానని పిటిషన్లో పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బు హైకోర్టు రిజిస్ట్రార్ దగ్గర డిపాజిట్ చేశారనీ, ఆ మొత్తం నుంచి తనకు కొంత మేరకు ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు.
పీఏసీఎల్ శారద కుంభకోణాల్లో న్యాయస్థానాలు ఉన్నతస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ఆస్తుల అమ్మకం, బాధితులకు డబ్బు పంపిణీ చేస్తున్నట్టు పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రావణ్ కుమార్ చెప్పారు. అదే తరహాలో అగ్రిగోల్డ్ విషయంలోనూ కమిటీ వేసి డిపాజిటర్లకు న్యాయం చేయాలని కోరారు.హైకోర్టు రిజిస్ట్రార్ అకౌంట్లో అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మగా వచ్చిన డబ్బు ఉంచడం వల్ల ప్రయోజనం లేదనీ,బాధితులకు డబ్బు వెళ్లినప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.900కోట్లు బడ్జెట్ నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిందనీ,తెలంగాణ వారికి మాత్రం సహాయం అందలేదని వివరించారు.వాదనల అనం తరం స్పందించిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌లో అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం ఇచ్చినట్టుగా తెలంగాణ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు సహాయం చేస్తుందో లేదో చెప్పాలని కోరింది. అగ్రిగోల్డ్ ఫ్రాడ్‌పై ఇప్పటికే తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందువల్ల దానితో కలిపి తాజా కేసును దసరా సెలవుల తర్వాత విచారణ చేస్తామని హైకోర్టు ప్రకటించింది. అగ్రిగోల్డ్ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం పెట్టుకున్న విన్నపంపై ప్రస్తావన వచ్చింది. పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘమనీ, ఏపీ హైకోర్టుకు కేసు బదిలీ చేయడానికి పిటిషనర్ వ్యతిరేకిస్తున్నారని న్యాయవాది తెలిపారు.
తుది తీర్పునకు లోబడి ఇఫ్లూ అధ్యాపక నియామకాలు : హైకోర్టు
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అదనపు ప్రొఫెసర్లు నియామకానికి సంబంధించిన ప్రక్రియ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా పోస్టుల భర్తీలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయలేదనీ, భర్తీ ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరుతూ పావని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల హైకోర్టు విచారించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిలుపుదల చేస్తూ జాతీయ బీసీ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసినపుడే పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేశారని పిటిషనర్ హైకోర్టు దష్టికి తీసుకొచ్చారు. వాదనల అనంతరం హైకోర్టు పై విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.