Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు సవాల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మంత్రి కేటీఆర్‌కు ధైర్యం ఉంటే సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వద్దకు రావాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (ఎస్సీకేఎస్-సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు సవాల్ విసిరారు. కేటీఆర్ శాసనమండలిలో రాష్ట్రంలో కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం చేశామనీ, సీఐటీయూకు పనిలేకుండా చేశామని అబద్ధాలు చెప్పారని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. కేటీఆర్‌కు నిజంగా మాట మీద నిలబడే దమ్ము ధైర్యం ఉంటే సీఎం కనుసన్నల్లో నడుస్తున్న, రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వద్దకు వచ్చి మాట్లాడాలని కోరారు. సింగరేణిలో గత అనేక ఏండ్లుగా కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెరగక చాలీచాలని జీతాలతో దయనీయమైన జీవితాలను గడుపుతున్నారని తెలిపారు. ఈ ఏడేండ్లలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు తక్కువగా ఉన్నాయనీ, వేతనాలు పెంచుతామని కేటీఆర్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మూడేండ్లయినా హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. సింగరేణి లాభాలలో కాంట్రాక్టు కార్మికుల శ్రమ ఉన్నదా?, బోనస్‌ను కాంట్రాక్టు కార్మికులకు ఎందుకు చెల్లించలేదని అడిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్, కవిత సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇప్పటికైనా కేటీఆర్ తమ సవాల్‌ను స్వీకరించి సింగరేణికి రావాలని కోరారు. లేదంటే అతను తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు చెప్పడం మానుకోవాలని సూచించారు. లేకపోతే సింగరేణి కాంట్రాక్టు కార్మికులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.