Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న లైంగిక దాడులు, హింస
- ఏరులై పారుతున్న మద్యం
- అశ్లీల వీడియోల నియంత్రణలో వైఫల్యం
- గాంధీ విగ్రహం వద్ద ఐద్వా నిరసన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు బలవుతున్నారనీ, రోజురోజుకు వారిపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని అఖిలభాతర ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర కమిటి అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి,మల్లు లక్ష్మి ఆందోళన వ్యక్తంచేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ ప్రాంతంలో ఉన్న గాంధీ విగ్రహానికి శనివారం వినతి పత్రం సమర్పించి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై హింస పెరిగిపోతున్నదని చెప్పారు. ప్రతి 20 నిముషాలకు ఒక లైంగిక దాడి, 93 నిముషాలకు ఒక వరకట్న హత్య జరుగుతున్నదంటూ నేర పరిశోధన రిపోర్టులు చెబుతున్నాయని గుర్తుచేశారు. బాలికల సంఖ్య తగ్గిపోతున్నదనీ, 0.6 సంవత్సరాల లోపు పిల్లల్లో 1000 మంది అబ్బాయిలు ఉంటే.. 914 మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారని తెలిపారు. కేరళలో 1000మంది బాలురకు 1028 మంది బాలికలు ఉన్నారని వివరించారు. తెలంగాణలో రోజురోజుకు మహిళలపై, చిన్నారులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయనీ, వారిని రక్షిస్తామనే ప్రచార ఆర్భాటం తప్ప, కార్యాచరణ లేదని విమర్శించారు. దీంతో హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీ, రామ్‌నగర్, హన్మకొండలో చిన్నారులపై వరసగా లైంగిక దాడులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. బోధన్, నల్గొండ జిల్లాల్లో గ్యాంగ్ రేప్‌లు జరిగాయని గుర్తుచేశారు. వయస్సుతో నిమిత్తం లేకుండా నెలల పాప నుంచి 90ఏండ్ల ముసలమ్మల వరకు ఈ దాడులకు గురవుతున్నారని తెలిపారు. వీటిని అరికట్టడానికి నిర్భయ, ఫోక్సో లాంటి చట్టాలు వచ్చినా..వీటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. ప్రజా ప్రతిఘటన తీవ్రంగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్లు చేస్తున్నారనీ, దీంతో తమ పని అయిపోయినట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జరుగుతున్న నేరాలకు కారణాలను పరిశీలించి, వాటిని నిలవరించాల్సిన ప్రభుత్వాలు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నాయన్నారు. మద్యం, డ్రగ్స్, పోర్న్ వీడియోలు వీటికి ప్రేరేపితంగా ఉన్నాయనే విషయం విచారణలో తేలుతున్నా.. వాటిని అరికట్టడంలో పాలకు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పారు. పైగా మద్యాన్ని ఆదాయ వనరులుగా చూడటం అన్యాయమన్నారు. మహిళ విలువలను దిగజార్చే విధంగా ఉండే సినిమాలు, సీరియల్స్, యాడ్స్ పైన సెన్సార్‌బోర్డు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా ఉపాధ్యక్షులు బి.హైమావతి, కెఎన్ ఆశాలత, సహాయ కార్యదర్శి డి.ఇందిర, కె.నాగలక్ష్మి పాల్గొన్నారు.