Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విధానాలు మార్చడం కోసమే ఉద్యమాలు
- 7న దేశవ్యాప్త నిరసన దినం
- ప్రజల సొమ్ము మానిటైజేషన్ పైప్‌లైన్ ద్వారా ప్రయివేటుపరం
- శాస్త్రీయంగా కనీస వేతనం నిర్ణయించాలి
- లేబర్ కోడ్లతో హక్కులు హరిస్తున్న కేంద్రం
- మతతత్వ ఎజెండాతో ప్రజలను చీల్చుతున్న బీజేపీ
- నవతెలంగాణ ఇంటర్వ్యూలో సీఐటీయూ ఉపాధ్యక్షులు ఎకె పద్మనాభన్
కార్మికులు, కర్షకులు ఐక్యంగా చేస్తున్న పోరాటాలు దేశానికి కొత్తదారి చూపిస్తున్నాయని సీఐటీయూ ఉపాధ్యక్షులు ఎకె పద్మనాభన్ అన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోవడం కోసమే ఉద్యమాలు చేపడుతున్నామని చెప్పారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా, ప్రజలకు వ్యతిరేకంగా విధానాలను అవలంబిస్తున్నదని విమర్శించారు. ఇంకోవైపు ప్రజలు ఐక్యం కాకుండా మతతత్వ ఎజెండాతో హిందూ, ముస్లింలను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని వివరించారు. ఎన్నో ఏండ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను లేబర్ కోడ్లుగా మార్చి హక్కులను హరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో కార్మికులు, రైతులు మరింత సంఘటితంగా ప్రభుత్వ విధానాలపై పోరాటం కొనసాగిస్తారని అన్నారు. కార్మిక గర్జన పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన ఎకె పద్మనాభన్ నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు..
మోడీ ప్రభుత్వం చేపట్టే నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ వల్ల కలిగే పరిణామాలేమిటీ?
దేశంలో 30 ఏండ్ల నుంచి నయాఉదారవాద విధానాలు అమలవుతున్నాయి. ప్రధానులు, ఆర్థిక మంత్రులు, పార్టీలు మారినా అవే విధానాలు కొనసాగుతున్నాయి. 1991 నుంచి 2014 వరకు సరళీకృత ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేయడం సాధ్యం కాలేదు. మోడీ ప్రభుత్వం ప్రయివేటీకరణను వేగంగా అమలు చేస్తున్నది. మైనార్టీ, మెజార్టీ పేర విక్రయంతోపాటు వ్యూహాత్మకంగా మొత్తాన్ని అమ్ముతున్నది. అయితే మోడీ ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ అని కొత్త పేరు పెట్టింది. దేశంలో ప్రజల సొమ్మును పైప్‌లైన్ ద్వారా ప్రయివేటుపరం చేయడమే దీని ఉద్దేశం. జాతీయ రహదారులు, రైల్వే, పోర్టులు, టెలికాం లైన్లు, ఎలక్ట్రికల్ లైన్లు, గనులు మొత్తం కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నది. ఇది అమ్మకం కాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటున్నారు. లీజు, తాత్కాలికం అనే పేరుతో వారికి దేశ సంపదను కట్టబెడుతున్నారు. రోడ్డు, రైలు, విమానాల్లో వెళ్లాలంటే ప్రజలు విపరీతంగా యూజర్ చార్జీలు చెల్లించాలి. కార్పొరేట్ల ఆస్తులను పెంచేందుకే ఈ నిర్ణయం. దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగించడమే మానిటైజేషన్ లైప్‌లైన్ పథకం. దీనికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఈనెల 7న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడతాయి. ఈనెలలోనే కేంద్ర కార్మిక సంఘాల జాతీయ కన్వెన్షన్ జరుగుతుంది. భవిష్యత్తులో ఒకరోజుకు మించి హర్తాళ్ (సమ్మె) ఉంటుంది.
కార్మిక కోడ్ల వల్ల కార్మికులకు వచ్చే ప్రమాదమేంటీ?
వందేండ్లుగా కార్మికులు అనేక పోరాటాలు చేసి చట్టాలు, హక్కులు సాధించుకున్నారు. ప్రభుత్వాలు సొంతంగా ఒక్క చట్టం తేలేదు. మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించింది. సమ్మె హక్కు, బేరసారాల హక్కు, పనిగంటలు, కనీస వేనం, సామాజిక భద్రత, ఈఎస్ఐ పీఎఫ్ వంటి హక్కులన్నింటిపైనా ప్రభావం పడుతుంది. కేంద్రం విధానాలు కార్మికులకు వ్యతిరేకం, కార్పొరేట్లకు అనులంగా ఉన్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడుతున్నాయి.
వలస కార్మికుల చట్టాలు ఏం చెబుతున్నాయి? ప్రస్తుతం ప్రభుత్వాలు అమలు చేస్తున్నదేమిటీ?
దేశంలో కోట్ల మంది వలస కార్మికులున్నారు. 1979లో ప్రభుత్వం వలస కార్మికుల చట్టం చేసింది. అది కాగితాలకే పరిమితమైంది. ఇంతవరకూ అమలు కాలేదు. కరోనా వల్ల ఆ చట్టం ఉందని అందరికీ తెలిసింది. లాక్డౌన్లో వలస కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, నడిచి తమ సొంతూర్లకు ఎలా వెళ్లారో చూశాం. రాష్ట్రంలో సీఐటీయూ పాదయాత్రలో వలస కార్మికుల ఇబ్బందులు నాయకుల దృష్టికి వచ్చాయి. లేబర్ కోడ్ల వల్ల వలస కార్మికులకు ఉన్న చట్టం కోల్పోయారు. 1979లో తెచ్చిన చట్టాన్ని తిరిగి అమలు చేయాలి. వలస కార్మికులకు గౌరవం, సామాజిక భద్రత, ఆహారం, నివాసం, వారి కోసం ప్రత్యేక రికార్డు ఉండాలి. సుప్రీం కోర్టు ఆదేశించినా ఎక్కడా వారి కోసం రికార్డుల్లో వివరాలను నమోదు చేయడం లేదు. సరైన వేతనం, వసతులు కల్పించడం లేదు.
వేజ్కోడ్ నేపథ్యంలో కనీస వేతనాల అమలును ఎలా చూడాలి?
బ్రిటీష్ వారి కాలం నుంచి ఇప్పటి వరకు కనీస వేతనాలు శాస్త్రీయంగా నిర్ణయించడం లేదు. 1957లో 15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ శాస్త్రీయ ప్రాతిపదికన కనీస వేతనాన్ని నిర్ణయించింది. అది అమలు కాలేదు. 1980లో కనీసవేతనానికి 25 శాతం అదనంగా కలిపి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కనీస వేతనాలకు ఒక చట్టం ఉన్నా అమలు కావడం లేదు. రాష్ట్రంలో అనేక ఏండ్లుగా షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాల అమలుకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. పాదయాత్రలో అనేక విషయాలు వచ్చాయి. కేరళలో మినహా ఎక్కడా కనీస వేతనాలు అమలు కావడం లేదు. కార్మికునికి రోజుకు రూ.375 ఇవ్వాలని ఒక కమిటీ నిర్ణయించింది. కుటుంబ అవసరాలకు ఎలా సరిపోతాయి. లేబర్ కోడ్ల వల్ల 8 గంటల పని 12 గంటలు పెరిగింది. శాస్త్రీయంగా కుటుంబానికి నలుగురు చొప్పున భావిస్తే కనీస వేతనం రూ.23 వేలు చెల్లించాలి. తెలంగాణలో రూ.19 వేలు ఇవ్వాలని పీఆర్సీ సిఫారసు చేసినా అదీ కార్మికులకు ఇవ్వడం లేదు.
భారత్‌బంద్, ఇతర కార్యక్రమాల్లో రైతులు, కార్మికులు ఉమ్మడిగా చేస్తున్న పోరాటాలు ఎలాంటి ఫలితాలనిస్తున్నాయి?, భవిష్యత్తులో జరిగే ఐక్యపోరాటాల గురించి వివరించండి?
దేశంలో కార్మికులు, రైతులు సంపదను సృష్టిస్తున్నారు. ఆహారం, వస్తువులు వారే ఉత్పత్తి చేస్తున్నారు. కానీ మోడీ సంపదను అంబానీ, అదానీ సృష్టిస్తున్నారు. రైతుల ఉద్యమం దేశానికి కొత్త కాదు. తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నవంబర్ నుంచి రైతులు చేస్తున్న ఉద్యమం కొత్త చరిత్రకు నాంది పలికింది. గతనెల 27న భారత్‌బంద్‌కు కిసాన్ సంయుక్త మోర్చా (ఎస్‌కెఎం) పిలుపునిచ్చింది. పది కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు ఏకతాటిపైకి వచ్చి మద్దతు ప్రకటించాయి. ఎస్‌కెఎం ఏ నిర్ణయం తీసుకున్నా కార్మిక సంఘాలు అండగా నిలబడాలని నిర్ణయించాయి. కార్మికులు, రైతులు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేపడుతున్నారు. ఇది దేశానికే కొత్తదారి చూపిస్తున్నది. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 7న దేశవ్యాప్త నిరసన దినం ఉంటుంది.
ఈనెల 8న రాష్ట్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో హర్తాళ్ జరుగుతుంది. రాబోయే రోజుల్లో కార్మికులు, కర్షకుల ఐక్య పోరాటాలు మరిన్ని పెరుగుతాయి. ఈ పోరాటాలను సక్సెస్ కాకుండా బీజేపీ మతతత్వ ఎజెండాను ముందుకు తెస్తున్నది. హిందూ, ముస్లింల మధ్య ఐక్యత రాకుండా ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మార్చడం కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాలి.