Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంచెలంచెలుగా కంచెలేసి అడ్డుకున్న పోలీసులు
- అనుమతిలేదంటూ ఎక్కడికక్కడ అరెస్టులు
- నేతల గృహ నిర్బంధం.. లాఠీచార్జీలు..ఉద్రిక్తత
- రేవంత్ ఇంటి చుట్టూ పోలీసు వలయం
- నేడు దిష్టిబొమ్మల దహనానికి రేవంత్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ తలపెట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్‌పై టీఆర్ఎస్ సర్కారు నిర్బంధాన్ని ప్రయోగించింది. దిల్సుఖ్నగర్ చౌరస్తాలోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఎల్బినగర్ వరకు మహాప్రదర్శన నిర్వహించాలని భావించిన కాంగ్రెస్‌కు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. సైరన్‌కు అనుమతిలేదంటూ నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడే పోలీసులు అరెస్టులు చేశారు. చాలా మంది ముఖ్యనాయకులను గృహ నిర్బంధం చేశారు. బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి నివాసాన్ని చుట్టుముట్టారు. ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. దీంతో రేవంత్ వారితో వాగ్వాదానికి దిగారు. అప్పటికే ఆయన నివాసానికి కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు దిల్సుఖ్నగర్ చౌరస్తాలో హైటెన్షన్ నెలకొంది. పోలీసుల తీరుకు నిరసనగా రేవంత్ తన ఇంటి ముందు భైఠాయించారు. మరోవైపు ఆయన్ను అడ్డుకోనేందుకు వందలాది మంది పోలీసులను మొహరించారు. అంచెలంచెలుగా కంచెలు వేశారు. బారీకేడ్లు ఏర్పాటు చేశారు. సొంత వాహనాలు, బస్సుల్లో వచ్చిన నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి గోషమహల్, అంబర్పేట్, ఎల్బీనగర్, సరూర్‌నగర్, ఉప్పల్, మహేశ్వరం, గాంధీనగర్ పోలీస్స్టేషన్లకు తరలించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వస్తున్న నేతలను అనేక చోట్ల అరెస్టులు చేసి స్థానిక పోలీసుస్టేషన్లకు తరలించారు. ఎల్బీనగర్, జూబ్లీహిల్స్‌లో కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. కొంత మంది తీవ్రగాయాలపాలయ్యారు. వెంకట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓయూ నేత విజరుకుమార్ తోపులాటలో సృహతప్పి పడిపోయారు. ఈ క్రమంలో ఎల్పీనగర్లో దుకాణాలు మూతపడ్డాయి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారారు పోలీసులను చేధించుకుని ఇందిరాగాంధీ విగ్రహానికి చేరుకోవడంతో పోలీసులు అవాక్కయ్యారు. స్థానికంగా కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులను సైతం పోలీసులు బలవంతంగా వాహనాలను ఎక్కించారు. ఈ కార్యక్రమానికి తాము రాలేదంటూ విద్యార్థులు ఎంత ప్రాధేయపడినా వదల్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్బంధం, అరెస్టయిన నాయకులు, కార్యకర్తలను రాత్రి పొద్దుపోయేదాకా పోలీసులు వదల్లేదని వారు చెబుతున్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్, మహేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు మల్లు రవి, వేంనరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనరెడ్డి, బండి సుధాకర్ అరెస్ట్ చేశారు. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బి వెంకట్‌కు గాయలయ్యాయి.
తాలిబన్ల రాజ్యంలో ఉన్నామా? రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా? లేక తాలిబన్ల రాజ్యంలో ఉన్నామా? అంటూ రేవంత్‌రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.తన ఇంటి మీదకు వచ్చిన కేటీఆర్ గుండాలపై తాను ఫిర్యాదు చేస్తే ఇంతవరకు పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తారా? అని నిలదీశారు. హౌస్ అరెస్ట్‌లు ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 1200 మంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో కనీసం అమరులకు నివాళలర్పించే హక్కు లేదా? అని ప్రశ్నించారు. శ్రీకాంతాచారి ఏమైనా కసబ్...మేమేమైనా టెర్రలిస్టులమా?, కేసీఆర్, కేటీఆర్‌ను తప్ప ఎవర్ని స్మరించవద్దా అని ప్రశ్నించారు. ఏండున్నరేండ్ల నుంచి ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. చేప పిల్లలు, బర్రెలు, గొర్రెలు పెంచుకోవాలంటూ పేద పిల్లలను చదువుకు దూరం చేస్తున్నారని చెప్పారు.పేదలకు ఉచిత విద్యను అందించాలని ఇందిరా గాంధీ చట్టం తీసుకొచ్చారనీ, టీఆర్ఎస్ సర్కారు విద్యకు దూరం చేస్తున్నదన్నారు. వనపర్తిలో లావణ్య అనే దళిత బిడ్డ ఆత్మహత్య చేసుకున్నదనీ, అది సర్కారు చేసిన హత్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆదివారం అంబేద్కర్ విగ్రహాల వద్ద టీఆర్ఎస్ సర్కారు దిష్టిబొమ్మలు దహనం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్ అరెస్టులను తీవ్రంగా ఖండించారు.