Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశ్రమలకు భూములిస్తే సరిపోతుందా?
- కనీస వేతన చట్టం అమలు సోయి లేదా?
- 8న కార్మికుల రాష్ట్రవ్యాప్త సమ్మె
- బానిసత్వంలోకి నెట్టే లేబర్ కోడ్ల రద్దుకు డిమాండ్
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేటీఆర్ హైటెక్కు మంత్రిలా మాట్లాడుతున్నారు.. పరిశ్రమలకు భూములిస్తే సరిపోతుందా? కనీస వేతనాలు ఇవ్వాల్సిన అవసరం లేదా? 2015లో టీఎస్ ఐపాస్ చట్టం తెచ్చి పరిశ్రమాధిపతులకు భూములిచ్చిన ప్రభుత్వం.. కార్మికులకు కనీస వేతనచట్టం అమలయ్యేలా చూడాలనే సోయిలేదా? అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు ప్రశ్నించారు.
ఖమ్మంలోని సుందరయ్య భవనంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైటెక్కు మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో దశాబ్దకాలం గడిచినా కొత్త జీవోలు విడుదల చేయకుండా కార్మికులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడి ఏడున్నరేండ్లయినా కొత్త రాష్ట్రంలోనూ పాతకాలం నాటి జీవోలు అమలు చేస్తున్నారని, జూన్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఐదు షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీస వేతనం రూ.18,029 అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వందేండ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికవర్గాన్ని బానిసత్వంలోకి నెట్టేందుకు పూనుకుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 8వ తేదీన సీఐటీయూ రాష్ట్రకమిటీ పిలుపు మేరకు నిర్వహించే రాష్ట్రవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో సుమారు 1.20 కోట్ల కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ రంగాల కార్మికులకు కనీస వేతనచట్టం-1948 ప్రకారం.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి ఐదేండ్లకోసారి వేతన సవరణ చేయాలన్నారు. 2014-16 సంవత్సరాల్లో రాష్ట్ర కనీస వేతనాల సలహామండలి చేసిన సిఫారసులను టీఆర్ఎస్ ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందన్నారు. 2018 జూలై 1 నుంచి అమలయ్యే పీఆర్సీలో కనీస వేతనం రూ.19,000గా నిర్ణయించిన ప్రభుత్వం.. షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీస వేతనాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సీఐఐ, ఎఫ్టీసీసీ లాంటి యాజమాన్య సంఘాల ఒత్తిళ్లకు తలొగ్గి కార్మి కుల కనీస వేతనాలను ఎగ్గొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నమని ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్ల రద్దు లక్ష్యంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నెలరోజులు గా కార్మిక గర్జన పాదయాత్ర కొనసాగుతోందన్నారు. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో కార్మిక పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్, మధు, నాయకులు యర్రా శ్రీకాంత్, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విష్ణు, కల్యాణం వెంకటేశ్వరరావు, రమ్య తదితరులు పాల్గొన్నారు.