Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిలగాని సంపత్ కుమారస్వామి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. పలు తీర్మానాలను ఆమోదించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనీ, మూడేండ్ల పీఆర్సీ బకాయిలు చెల్లించాలని కోరారు. బకాయి ఉన్న మూడు డిఏలు వెంటనే విడుదల చేయాలనీ, ఇండ్ల స్థలాలు కేటాయించాలనీ, ఆదాయపు పన్ను మినహాయించాలనీ, నూతన జోనల్ విధానం సవరించి హైదరాబాదు రాష్ట్ర రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌గా చేయాలనీ కోరారు. జిల్లా క్యాడర్ సంఖ్యను ఖరారు చేసి, హరిత నిధి నుండి ఉద్యోగులను మినహాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో 14 డిమాండ్లతో కూడిన తీర్మానాలను ఆమోదించినట్టు వివరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి పురుషోత్తం, మహిళా అధ్యక్షురాలు, జి నిర్మల, కోశాధికారి గడ్డం బాలస్వామి పాల్గొన్నారు.