Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనియన్లపై ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ అనుచిత వ్యాఖ్యలు సరిగాదు
- వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఎస్ఆర్టీసీని మూసేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యికోట్ల రూపాయలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారనీ, ఆ లేఖను వెంటనే బహిర్గతం చేసి రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, ఎం.సాయిబాబు డిమాండ్ చేశారు. కేంద్రం లేఖ రాస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానూ స్పందించకపో వడం వెనుక ఉన్న కారణాలేమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఓ ఇంటర్వ్యూలో ఆర్టీసీ కార్మిక సంఘాలపై చైర్మెన్ బాజిరెడ్డి అభాండాలు వేయడాన్ని ఖండించారు. 2019లో కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన ఎం.వి.యాక్టు చట్టాన్ని పార్లమెంట్లో టిఆర్ఎస్ సభ్యులు బలపర్చారని గుర్తుచేశారు. కరోనా కాలంలో కూడా డిజిల్‌పై ఎక్సైజ్ పన్ను, వ్యాట్‌ను విపరీతంగా పెంచి బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు ఆర్టీసిని సంక్షోభంలోకి నెట్టాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర పాలకుల విధానాల వల్ల ఆర్టీసీ నష్టాల్లోకి కూరుకుపోతే కార్మిక సంఘాలపై ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఆర్టీసీ రక్షణ - కార్మికుల హక్కుల పరి రక్షణ కోసం కార్మికుల సంఘాలు నిరంతరం పోరాటాలు చేస్తాయని తెలిపారు. 2001లో జరిగిన 24 రోజుల సమ్మె, 2005లో జరిగిన 5 రోజుల సమ్మెల ద్వారా ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి 100శాతం రీయంబర్స్మెంట్ నిధులు వచ్చాయని గుర్తుచేశారు. 2019లో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కనీసం సంప్రదింపులు కూడా చేయకుండా వ్యవహరించిన ప్రభుత్వం, కార్మికులు సమ్మెకు వెళ్ళడం తప్ప మరో దారి లేకుండా చేసి, కార్మిక సంఘాలను నిందిచండం సరిగాదని పేర్కొన్నారు. ఆర్టీసీకి 74,000 కోట్ల విలువైన ఆస్తులువున్నాయనీ, వాటిని ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే చర్యలను మానుకోవాలని సూచించారు. ఆర్టీసీ యాజమాన్యమే వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఆర్టీసీకి ఏటా రూ. 3000 కోట్లు ఇస్తున్నామని పదేపదే చెబుతున్నారనీ, 2014 నుంచి 21 వరకు ఆర్టీసీకి ఇవ్వాల్సినవి పరిశీలిస్తే అదనంగా రూ.1008 కోట్లే ఇచ్చారని తెలిపారు. బడ్జెటేతర వనరుల ద్వారా ఇస్తామన్న రూ.1500 కోట్లు ఆర్టిసి తిరిగి చెల్లించాల్సిన అప్పేనన్న నిజాన్ని చైర్మెన్ తెలుసుకోవాలని సూచించారు. కార్మిక సంఘాలను నూతన చైర్మెన్, డైరెక్టర్ విశ్వాసంలోకి తీసుకోని, ఆర్టీసీ అభివృద్ధిపై సూచనలు తీసుకోవాలని కోరారు.