Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోదావరిలో ఇద్దరు గల్లంతు
- మరొకరిని కాపాడిన స్థానికులు
నవతెలంగాణ-నందిపేట్
గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతు కాగా, ఒకరిని స్థానికులు సురక్షితంగా కాపాడారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఉమ్మెడ బ్రిడ్జి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని జలోర్ జిల్లా బాగ్గోడ గ్రామానికి చెందిన పలువురు నందిపేట్ మండల కేంద్రంలో నివసిస్తూ కిరణా, ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. ఆదివారం కావడంతో గోదావరి అందాలను తిలకించేందుకు ఉమ్మెడ గ్రామ శివారులోని ఉమామహేశ్వర ఆలయం వద్దకు ఆరుగురు మిత్రులు కలిసి వెళ్లారు. స్నానం చేసేందుకు గోదావరిలోకి దిగారు. వరద ఉధృతికి కేతారం దేవసి (30), హీరారం దేవసి (28), జామ్ తారం కొట్టుకుపోతుండగా మిగతా వారు కేకలు వేయడంతో.. స్థానికులు జామ్ తారమ్ను సురక్షితంగా రక్షించారు. కేతారం దేవసి, హీరారం దేవిసి గోదావరిలో గల్లంతయ్యారు. మండల కేంద్రంలో వ్యాపారం చేస్తూ అందరితో కలిసి మెలసి ఉన్న వీరు గల్లంతు వార్త మండల కేంద్రంలో విషాదం నింపింది. విషయం తెలుసుకున్న వ్యాపారస్తులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ శోభన్ బాబు తెలిపారు.