Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ కూంబింగ్‌తో వెలుగులోకి..
- వేటగాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- అటవీ జంతువులను వేటాడితే చర్యలు తప్పవు
- ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్
నవతెలంగాణ-ములుగు
వేటగాళ్ల ఉచ్చుకు పెద్దపులి బలైంది. పోలీసుల కూంబింగ్‌తో ఈ ఘటన వెలుగులోకి రావడంతో వేటగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అటవీ జంతువులను వేటాడితే చర్యలు తప్పవని ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ స్పష్టం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆశతో కలిసి ఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఛత్తీస్గడ్ నుంచి వలస వచ్చిన గోతికోయలు.. ములుగు జిల్లా పరిధిలోని తాడ్వాయి మండలంలోని కొడిశల అటవీ ప్రాంతంలో పోడు వ్యవసాయ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదాయం సరిపోక అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో అడవి జంతువులను వేటాడి అమ్ముకోవాలని ప్రయత్నించారు. ఇందులో భాగంగా కొడిశల అటవీ ప్రాంతంలో ఉచ్చులు ఏర్పాటు చేశారు. పెద్ద పులిని చంపి దాని చర్మం, గోర్లు, మాంసం విక్రయించాలని యత్నించారు. కాగా పోలీసుల గస్తీతో వ్యవహారం బట్టబయలైంది. పెద్ద పులిని చంపి ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు తాడ్వాయి ఎస్ఐ ఆధ్వర్యంలో బలగాలు గస్తీ నిర్వహించగా కాటాపూర్ క్రాస్ రోడ్డు వద్ద కారులో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తారసపడ్డారు. వారిని, వారి వాహనాన్ని తనిఖీ చేయడంతో పులి గోర్లు లభ్యమయ్యాయి. పోలీసుల విచారణలో నిందితుల నుంచి పులి చర్మం, గోర్లు, కాళేబరం, ఉచ్చులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా గత నెల 21నే నిందితులు ఉచ్చులతో పెద్దపులిని హతమార్చినట్టు విచారణలో వెల్లడైంది. ఈ ఘటనకు పాల్పడ్డ మడవి నరేష్, మాడవి ఎరుమయ్య, మడకం ముకేష్, మడవి దేవాలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్టు ఎస్పీ చెప్పారు. సమావేశంలో ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య, డీఎఫ్ఓ శివ ఆశిష్, తాడ్వాయి ఎఫ్డీఓ ప్రశాంత్ పాటిల్, ములుగు ఎఫ్డీఓ జోగేంద్ర, పసర సీఐ శంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.