Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజర్వేషన్లను సమాధి చేసేందుకు బీజేపీ కుట్ర
- అక్టోబర్ 9న చలో హైదరాబాద్: కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ - కల్వకుర్తి రూరల్/ముషీరాబాద్
అసమానతలు అంతమయ్యే వరకూ రిజర్వేషన్లు కొనసాగించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. కేవీపీఎస్ 22వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాలో రిజర్వేషన్లు-సామాజిక న్యాయం, సాధికారత' అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్లలో స్కైలాబ్‌బాబు పాల్గొని మాట్లాడారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడల్లా రిజర్వేషన్లను తొలగించే కుట్రలకు పాల్పడుతోందన్నారు. రిజర్వేషన్లు ఎవరిచ్చిన భిక్ష కాదనీ, అది రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయ హక్కు అని తెలిపారు. మూడు వేల ఏండ్లుగా దళితులు, బలహీన వర్గాలు ఈ దేశాభివృద్ధికి వారి శ్రమను ధారపోశారన్నారు. భూమి, పరిశ్రమలు, ప్రకృతి వనరుల్లో సమాన వాటా పొందగలిగితే రిజర్వేషన్ల అవసరం ఉండదని చెప్పారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లను చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. మున్సిపాల్టీల్లో వీధులు ఊడ్చే, మరుగుదొడ్లు శుభ్రం చేసే పనులను దళితులకు అంటగట్టి కీలక ఉత్పత్తి వనరులను దేశంలో అగ్రకుల పెత్తందారుల చేతుల్లోకి తీసుకుని ఏలుతున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశువులకు రక్షణ ఉంది కాని దళితులు, మహిళలు, మైనార్టీలకు రక్షణ లేదనీ, బీజేపీ రాజకీయ విధానం వారికి వ్యతిరేకమని తెలిపారు. బీజేపీ అధికార అండదండలతో ఆర్ఎస్ఎస్ తన రహస్య ఎజెండా ద్వారా అనేక దేశద్రోహ చర్యలకు పాల్పడుతుందన్నారు. దేశ సంపదను కొల్లగొడుతూ మరోవైపు దేశభక్తి ముసుగు ధరించడం సిగ్గు చేటన్నారు. మనువాద సంస్కృతి ముమ్మాటికీ మెజార్టీ ప్రజలకు వ్యతిరేకమన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకిచ్చిన వాగ్దానాలు అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.