Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ స్టేట్ గెస్ట్ ఫ్యాకల్టీ జేఏసీ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లను అనుమతించాలని తెలంగాణ స్టేట్ గెస్ట్ ఫ్యాకల్టీ జేఏసీ అధ్యక్షులు బైరగోని ప్రసాద్, అధికార ప్రతినిధి కుంట దేవేందర్ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,700 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారనీ, కళాశాలల్లో భౌతిక తరగతులు ప్రారంభమైనా, వారిని అనుమతించట్లేదని తెలిపారు. వారికి మూడు నెలల వేతనాలు కూడా చెల్లించాల్సి ఉన్నదనీ, అవీ ఇవ్వట్లేదన్నారు. గడచిన 19 నెలలుగా గెస్ట్ లెక్చరర్లకు ఉపాధి లేకుండా పోయిందనీ, ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి సహాయ సహకారాలు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మాభిమానం కోల్పోయి, ఆర్థికంగా చితికిపోయిన గెస్ట్ లెక్చరర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం వారిని రెన్యువల్ చేసి విధుల్లోకి అనుమతించాలనీ, బకాయిలు చెల్లించాలని కోరారు.
గెస్ట్ లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
గెస్ట్ లెక్చరర్ల సమస్యలపై ఇంటర్ బోర్డు, ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కారం చూపి 1600 కుటుంబాలను ఆదుకోవాలని ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి, గెస్ట్ లెక్చరర్ల సంఘం (2152) నేతలు డిమాండ్ చేశారు. ఆర్థిక సమస్యలు తాళలేక ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసుకుని హైద్రాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గెస్ట్ లెక్చరర్ కాట్రావత్ శ్రీనివాస్ నాయక్‌ను ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి, ఇంటర్ ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ బాధ్యులు ఎం.జంగయ్య, గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, నాయకులు ఇస్సాక్, యుగేందర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.