Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారికి అనేక అవకాశాలిచ్చిన చరిత్ర మాదే: రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంగ్రెస్ అనేది దళితుల పార్టీ అని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరా భవన్లో ఆదివారం టీపీసీసీ ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ తమ పార్టీ ఒక దళితున్ని రాష్ట్రపతి చేసింది, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎస్సీకి అవకాశమిచ్చింది, పంజాబ్లో సీఎం కుర్చీలో కూర్చొబెట్టింది, తెలంగాణలో శాసనసభా నాయకుడి బాధ్యత అప్పజెప్పింది, ఏపీలో శైలజానాథ్ ను పీసీసీ చీఫ్గా చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలను నిర్లక్ష్యం చేయలేదని చెప్పారు. తమ పార్టీ ప్రభుత్వరంగ సంస్థలను నెలకొల్పితే వాటిని బీజేపీ అమ్ముతూ రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ మంత్రి మల్లారెడ్డికి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు ప్రయివేటు యూనివర్సిటీలు కట్టబెట్టి రిజర్వేషన్లు లేకుడా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనలో పేదల చదువులకు దూరమయ్యారనీ, పీఎం నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ విధానాలు ప్రమాదకరంగా మారాయనీ, ఈ విధానాలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
దళితులపై నిజంగా ప్రేముంటే సీఎం అభ్యర్థిగా ప్రకటించు.....
దళితులపై సీఎం కేసీఆర్ కు నిజంగా ప్రేముంటే 2023 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఒక ఎస్సీని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీరాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మానిక్కం ఠాగూర్ సవాల్ విసిరారు. అధికారంలోకి వస్తే దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తామన్న మాట తప్పి కేసీఆర్ మనవాదాన్ని పాటిస్తున్నారని విమర్శించారు. దేశంలో ఒక్క పంజాబ్ రాష్ట్రానికి మాత్రమే దళిత సీఎం ఉన్నారనీ, ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వివరించారు. ప్రతిపక్ష పార్టీ నేతగా భట్టిని చూడలేకనే 12 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితునికి మున్సిపల్ శాఖనివ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సెల్ చైర్మెన్ ప్రీతం మాట్లాడుతూ అక్టోబర్ 9 నుంచి మూడు నెలల పాటు రాష్ట్రంలో పర్యటిస్తామనీ, ప్రతి వారం రెండు గ్రామాలను ఎంచుకుని దళిత వాడల్లో తిరుగుతామని తెలిపారు. సమావేశం లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
12న రెండో జంగ్ సైరన్ ....
అక్టోబర్ 12న రెండో జంగ్ సైరన్ మోగిస్తామని మాజీ ఎంపీ మధుయాష్కీ తెలిపారు. తెగింపుతో పోరాడిన బలమూరు వెంకట్ కు కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ టికెట్ ఇచ్చిందనీ, భవిష్యత్తులోనూ పోరాడే వారికి ఇదే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. పోలీసుల దాడిలో వెంకట్ పక్కటెముకలు ఫ్రాక్చర్ అయ్యాయనీ, కోలుకున్న తర్వాత ప్రచారం మొదలు పెడతామని తెలిపారు.