Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బంధు మాదిరిగా బీసీ బంధు అమలు చేయగలరా?
- ఉద్యమం బీసీలది.. రాజ్యాధికారం ఇతరులదా?
- జనాభాలో మనమెంతో మనకంత వాటా ఇవ్వాలి
- బీసీల అభివృద్ధికి వైఎస్ఆర్టీపీ పెద్దపీట
- వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపకురాలు వైఎస్. షర్మిల
నవతెలంగాణ - కోస్గీ
దేశ సంపదను సృష్టించింది బీసీలేననీ, జనాభాలో మనమెంతో మనకంత వాటా ఇవ్వాలని వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్.షర్మిల అన్నారు. నారాయణపేట జిల్లా కోస్గీ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన బీసీల గౌరవ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు ఉన్నా అక్కడ కొత్త స్కీములు పుట్టుకొస్తాయనీ, దళిత బంధు పథకం అలాంటిదేనని తెలిపారు. ఈ దళిత బంధు లాగా బీసీ బంధును కేసీఆర్ అమలు చేయగలరా అని సవాల్ విసిరారు. బీసీల వెనుకబాటుతనం వల్ల పాలకులు వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఏడేండ్ల కాలంలో బీసీలను మోసం చేశారే తప్ప వారికి ఒరగబెట్టిందేమీలేదన్నారు. బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయలేదనీ, కార్పొరేషన్ రుణాల కోసం 8 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే వాటిని చెత్త బుట్టలో వేశారని ఆరోపించారు. విదేశాల్లో చదివే బీసీ విద్యార్థుల చదువుకు శ్రద్ధ చూపలేదనీ, స్థానిక సంస్థలు, పంచాయతీలు, మున్సిపాలిటీ ఎలక్షన్లలో బీసీ రిజర్వేషన్లను తగ్గించారన్నారని విమర్శించారు. పద్మశాలి, చాకలి, మంగలి, సంచార జాతుల కులాలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా శాసనసభలో లేడన్నారు, 0.5శాతం ఉన్న వెలమ కులస్తులకు మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవి అవసరమా అని ప్రశ్నించారు. బీసీల కోసం 2018లో రూ.1000 కోట్లు కేటాయిస్తే రూ.4కోట్లు, 2019లో రూ.1000 కోట్లు కేటాయిస్తే అందులో 5కోట్లు మాత్రమే ఖర్చు చేశారంటే వారిపై కేసీఆర్‌కు ఎంత ప్రేమ ఉందో అర్థమౌతుందన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఉచిత విద్య, ఆరోగ్యశ్రీ, పక్కా గృహాలను ఇచ్చి ఆదుకోవాలన్నారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్స్ ఇవ్వకుండా బీసీలను చదువుకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూలుపై చేనేతకు 50 శాతం సబ్సిడీ ఇస్తాననీ, బీమా అమలు చేస్తామనీ, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామనీ, చెప్పి.. చివరకు కనీసం రుణాలు కూడా ఇవ్వకుండా వారి జీవితాలు నాశనం చేసిన పాపం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీసీలంటే వెనకబడిన వారు కాదని వెన్నెముక లాంటి వారని నిరూపించుకోవాలన్నారు. బీసీల అభివృద్ధే లక్ష్యంగా తమ పార్టీ ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బిల్లును ఢిల్లీకి పంపిన నాయకుడు వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. అంతకుముందు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన బీసీ ప్రజా నాయకుల చిత్ర పటాలకు నివాళ్లు అర్పించారు. సభలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న, నియోజకవర్గ ఇంచార్జి తమ్మలి బాలరాజ్, రాష్ట్ర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.