Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్వవిద్యార్థులు భావితరాలకు ఆస్తి
- ర్యాగింగ్‌ను అరికట్టాలి
- జేఎన్టీయూ స్వర్ణోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రస్తుతం ప్రతి ఒక్క అంశం సాంకేతికపైనే ఆధారపడి ఉందనీ, ఆ పరిజ్ఞానాన్ని మరింత పెంచుకుంటేనే అభివృద్ధిలో వేగంగా ముందుకు పోగలుగుతామని రాష్ట్రగవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్‌లోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్.. స్వర్ణోత్సవాల లోగోను ఆవిష్కరించారు. గోల్డెన్ జూబ్లీ మిలీనియం భవనానికి ఆమె శంకుస్థాపన చేసి మొక్క నాటారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ..జేఎన్టీయూ దేశంలోనే మొట్టమొదటి సాంకేతిక విశ్వవిద్యాలయమనీ, దానికి మంచి పేరుందని కొనియాడారు. 1972 నుంచి ఇప్పటివరకు ఈ 50 ఏండ్లలో ఈ విశ్వవిద్యాలయం ఎన్నో మైలురాళ్లు, ప్రత్యేకతలు సాధించిందని గుర్తుచేశారు. సాంకేతికత పరిజ్ఞానం, సృజనాత్మక ఆలోచనలతో విద్యార్థులు మెరుగైన ఉపాధి అవకాశాలను పొందాలని ఆకాంక్షించారు. యూనివర్సిటీ పరిధిలో ఇప్పటి వరకూ 19 లక్షల మంది చదువుకున్నారనీ, వారందరి గుర్తుగా ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పూర్వ విద్యార్థులంటే భావితరాలకు ఆస్తి అనీ, వారందరినీ ఏకం చేస్తే మరిన్ని విజయాలు సాధింవచ్చని పేర్కొన్నారు. పూర్వవిద్యార్థులు తమ ఆదాయంలో ప్రతి ఏటా ఎంతో కొంత జేఎన్టీయూకు కేటాయించాలని కోరారు. ఒక్కొక్కరు రూపాయి చొప్పున ఇచ్చినా ఏటా రూ.20 లక్షలు అవుతుందని చెప్పారు. దీనివల్ల వర్సిటీని మరింత అభివృద్ధి చేసుకోవ చ్చునని సూచించారు.
విద్యలో మూలసూత్రాలను మరువొద్దనీ, నిరంతరం సృజనాత్మకంగా ఆలోచించాలని పలు ఉదహరణలు చెబుతూ విద్యార్థులకు వివరించారు. భాషా నైపుణ్యాలు కూడా వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తా యనీ, వాటిపైనా దృష్టి సారించాలని సూచించారు. ర్యాగింగ్ వల్ల పిల్లలు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారనీ, కొందరు విద్యార్థులు డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ర్యాగింగ్‌ను అరికట్టాలన్నారు. జేఎన్టీయూ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ కట్టా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, సిబ్బంది కలిసికట్టుగా పనిచేయడం వల్లనే దేశంలోనే తమ వర్సిటీకి మంచి పేరు వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ఈ వర్సిటీకి అనుబంధంగా అనేక కళాశాలలు ఉన్నాయనీ, కొత్తగా సిరిసిల్లలో ఇంజినీరింగ్ కళాశాలకు, సుల్తాన్‌పూర్‌లో ఫార్మా కళాశాల ఏర్పాటుకు అనుమతి లభించిందని తెలిపారు. అనంతరం పూర్వవిద్యార్థుల్లో పలువురు ప్రముఖులకు మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, రెక్టార్ డాక్టర్ ఎ.గోవర్ధన్, స్వర్ణోత్సవాల కమిటీ చైర్మెన్ డాక్టర్ విజరుమోహన్, తదితరులు పాల్గొన్నారు.