Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు కౌలు రైతుల ఆత్మహత్య
నవతెలంగాణ-ఇల్లంతకుంట / బజార్హత్నూర్
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సాగుకు తెచ్చిన అప్పులు తీర్చే పరిస్థితి లేక మనస్తాపానికి గురై ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆదివారం జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జవారిపేటకు చెందిన గౌరవేణి రాజయ్య (55) కొన్నేండ్లుగా ఇదే గ్రామంలో భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా 6 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాడు. అధిక వర్షాలకు పంట బాగా లేకపోవడంతో పెట్టుబడికి చేసిన అప్పులు ఎలా తీరుతాయని మనోవేదనకు గురయ్యాడు. ప్రతేడాది పంటలో నష్టం రావడంతో మొత్తం 10లక్షల రూపాయల అప్పు అయ్యింది. ఈ క్రమంలో మూడు రోజులుగా తీవ్ర మనస్తాపం చెందుతున్న రాజయ్య.. ఆదివారం ఉదయం పత్తి చేను వద్దకు వెళ్లి అదే చేనుకు కొట్టేందుకు తెచ్చిన పురుగులమందు తాగి తన సోదరునికి ఫోన్ద్వారా తెలిపాడు. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. మండల కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు తెలిపారు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఇల్లంతకుంట ఎస్ఐ రఫీక్ ఖాన్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం సోనాల గ్రామానికి చెందిన యువ రైతు ఏకీలెరి శశిధర్ (28) బజార్హత్నూర్ మండలం కొల్హరి గ్రామ సమీపంలో గతేడాది తనకున్న 4 ఎకరాలతో పాటు 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి, సోయాబీన్ పంటలు సాగు చేశాడు. పత్తికి గులాబీ పురుగు సోకి రూ.3 లక్షల నష్టం వాటిల్లింది. ఈ ఏడాదీ సోయాబీన్, పత్తి పంటలు సాగు చేయగా భారీ వర్షాలు, వరదలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంటల సాగు కోసం రూ.8 లక్షల అప్పు చేశాడు. వాటిని ఎలా తీర్చాలన్న మనస్తాపానికి గురై తన పొలంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.