Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాపై అనేక కోణాల్లో ప్రజలకు అవగాహన
- జేవీవీ ముగింపు వెబినార్‌లో ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోవిడ్-19 వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచటం ద్వారా వారిని అప్రమత్తం చేయాలనే ఉదాత్త లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక నిర్వహించిన వెబినార్ల పరంపర ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్ 18న మొదటి వెబినార్ తో వాటిని మొదలు పెట్టారు. కరోనా లక్షణాలు, వ్యాధి నిర్దారణలో సందేహాలు, తీవ్రతకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతరులకు సోకకుండా పాటించాల్సిన నియ మాలు, ఆహారపు అలవాట్లు, కరోనాకు రకరకాల మందులపై జరుగుతున్న ప్రచారా లు, కోవిడ్‌తో ఊపిరితిత్తులతో పాటు ఇతర అవయవాలపై పడే ప్రభావం, ఆస్పత్రి లో చేరకముందు ఇంటి వద్ద కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తులు ఎలాంటి ప్రవర్తనను అలవరుచుకోవాలి....ఇలా పలు అంశాలపై ప్రముఖులు, ప్రత్యేక వైద్యనిపుణులతో ప్రతి ఆదివారం జేవీవీ ఆధ్వార్యాన ప్రసంగాలను ఇప్పించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు అడిగిన సందేహాలను నివృత్తి చేయించారు. ఒకవైపు కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో డాక్టర్ల ద్వారా రోగులకు సేవలందించి, సేవా కార్యక్రమాలతో వారిని ఆదుకునేందుకు ఇతోధిక సహాయం అందించిన జన విజ్ఞాన వేదిక మరోవైపు అవగాహన పెంచటం ద్వారా ప్రజలు తమను తాము కాపాడుకునేందుకు వీలుగా అవసరమైన వైద్య విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేసింది. ప్రతి ఆదివారం సాయంత్రం క్రమం తప్పకుండా ప్రజలకు తమ ఆరోగ్యం కాపాడుకునే పాఠాలు వినే అలవాటు చేసింది. ఆదివారం జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అందె సత్యం అధ్య క్షతన 'ప్రజా వైద్యం - ప్రభుత్వ విధానాలు' అనే అంశంపై 25వ, చివరి వెబినార్‌ను ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ హరగోపాల్‌తో నిర్వహించారు. కరోనాపై వరుస వెబినార్లు నిర్వహించేం దుకు సహకరించిన డాక్టర్లు, వీక్షకులు తదితరులందరికి జెవీవీ ధన్యవాదాలు తెలిపింది.
ఉద్యమాలతోనే ప్రజా వైద్యానికి చికిత్స : ప్రొఫెసర్ హరగోపాల్
ఉద్యమాలతోనే ప్రజావైద్యానికి చికిత్స లభిస్తుందని ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. సోషలిస్టు దేశాలతో పాటు స్వీడన్ లాంటి దేశాల్లో కూడా విద్య, వైద్యం లాంటివి ఉచితంగా అందిస్తూ మానవీయ సమాజంవైపు పయనిస్తుంటే మనదేశంలో అందుకు భిన్నంగా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 1980లో వచ్చిన నూతన సరళీకృత ఆర్థిక విధానాలు సమాజంలో ఆర్థిక అంతరాలను పెంచాయని గుర్తుచేశారు. శాస్త్రీయ పరిశోధనలు ఎప్పుడు ధనవంతుల డిమాండ్ మేరకే జరిగా యని తెలిపారు. అదే విధంగా వైద్య పరిశోధనలు కూడా సామాన్యులకు అవసరమయ్యే కోణంలో జరగకపోవటంతో 70 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా గ్రామీణ పేదలు నేటికీ భూత వైద్యం, అతీంద్రీయ శక్తులపై విశ్వాసం పెంచు కుంటున్న పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో భౌతిక వనరుల పెంపుపై పెట్టిన దృష్టి మానవాభి వృద్ధిపై పెట్టలేదని విమర్శించారు. ఆరోగ్యం విషయంలో మన దేశం బంగ్లాదేశ్ కంటే వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ధనవంతులకు, పేదలకు ఒకే రకమైన విద్య, వైద్యం అందించే విద్యాలయాలు, ఆస్పత్రులుంటే వాటి సేవ ల్లో నాణ్యత ఉండేదని వివరించారు. కార్పొరేట్ వ్యవస్థ వచ్చాక వైద్యవిద్య వ్యాపారంగా మారిందనీ, డబ్బులు పెట్టి వైద్య విద్యను కొనుక్కునే వారు పేదలకు సేవలు అందిస్తారా? అని ప్రశ్నించారు. కరోనా సంక్లిష్ట సమయంలో క్యూబా లాంటి చిన్న దేశాలు ప్రపంచానికి డాక్టర్లను అందిస్తే, మన దేశంలో నేటికి 10 వేల మందికి ఒక డాక్టరు కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. ఉన్న డాక్టర్లలో కూడా గ్రామా ల్లో తక్కువ మంది ఉన్నారనీ, వైద్యవిద్యలో నైతిక విలువలు పెంచే అంశాలు లేకపోవటమే ఈ దుస్థితికి కారణమని విశ్లేషించారు. పెట్టుబడికి నైతిక పునాది ఉండదనీ, అందుకే అమెరికా లాంటి దేశాల్లో స్వార్థంగా ఉండటమే సరైన జీవితమనీ, ఇతరుల కోసం ఆలోచించటం బలహీనుల లక్షణమనే సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయని ఉదహరించారు. దేశంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం వస్తే తప్ప ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనివ్వరని స్పష్టం చేశారు.
తెలిసి జాగ్రత్తలు తీసుకోకే లక్షలాది మరణాలు : డాక్టర్ అందె సత్యం
కరోనా రెండో వేవ్ వస్తుందని తెలిసి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోలేదని డాక్టర్ అందె సత్యం విమర్శించారు. దీంతో లక్షలాది మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో ఒక్క కేరళ రాష్ట్రంలో మాత్రమే కరోనా సమయంలో 97 శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందారన్నారు.
ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత : ఆర్.వరప్రసాద్
ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత అనేనినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వరప్రసాద్ తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ప్రయివేటు దోపిడీకీ ప్రజలు గురి కాకుండా చూసేందుకు జేవీనీ తన వంతు ప్రయత్నాలు చేసిందని గుర్తుచేశారు.
ఎన్‌సీడీలపై ప్రజల్లో అవగాహన : ఎ.సురేశ్
రాబోయే కాలంలో మధుమేహం, కాలేయం, మూత్రపిండాలు, కాలుష్యకారక నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్ సీడీ)లపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్టు జేవీవీ హెల్త్ సబ్ కమిటీ కన్వీనర్ ఎ.సురేశ్ తెలిపారు. కరోనాపై వరుస వెబినార్లు నిర్వహించేందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.