Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్మినెంట్, మల్టీపర్పస్ విధానం రద్దు కోసం పట్టు
- 2,3 నెలలుగా పంచాయతీ కార్మికులకు సరిగా అందని వేతనాలు
- మున్సిపల్ కార్మికులకు పీఆర్సీలోనూ అన్యాయమే
- నేడు చలో హైదరాబాద్‌కు జేఏసీ పిలుపు
- సుందరయ్యపార్కు వద్ద సభ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులు, సిబ్బంది బతుకుపోరుబాట పట్టనున్నారు. మల్టీపర్పస్ విధానం రద్దు కోసం గొంతెత్తనున్నారు. గొడ్డుచాకిరీ చేస్తున్నా తమకు కనీసవేతనం దక్కకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు,మూడు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో పెట్టడంపై పంచాయతీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పీఆర్సీల్లో తమకు కనీసవేతనాన్ని అమలు చేశారనీ, ఈ సారే 30 శాతం పేరుతో తీవ్ర అన్యాయం చేస్తున్నారని మున్సిపల్ కార్మికులు వాపోతున్నారు. కేటగిరీల వారీగా వేతనాలు..పర్మినెంట్..మల్టీపర్పస్ విధానం రద్దు..పీఆర్సీ అమలు..తదితర డిమాండ్లకోసం తెలంగాణ గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ(సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ, ఏఐయుటీయూసీ, ఇతర కార్మిక సంఘాలు) ఆధ్వర్యంలో సోమవారం చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. బాగ్‌లింగంపల్లిలో గల సుందరయ్య పార్కు వద్ద సభను నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 12,765 గ్రామ పంచాయతీల్లో 36,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పారిశుద్ధ్యం, నర్సరీలు, వాటర్ సప్లై, వీధి దీపాల నిర్వహణ, పన్నులు వసూలు చేయడం, ఆఫీసు నిర్వహణ తదితర పనుల్లో వివిధ కేటగిరీల సిబ్బంది విధులను నిర్వర్తించేశారు. ప్రస్తుత ప్రభుత్వం మల్టీపర్పస్ విధానాన్ని తెచ్చి అన్ని పనులనూ అందరితోనూ చేయిస్తున్నది. వీరిలో అత్యధికులు దళితులు, బడుగుబలహీన వర్గాల వారే. అందులోనూ మహిళలే ఎక్కువ. కొత్త గ్రామపంచాయతీలు పెరిగాయి. జనాభా పెరిగింది. కానీ, వీరి సంఖ్య మాత్రం పెరగలేదు. వీరికి జీవో నెంబర్ 51 ద్వారా రూ.8500 వేతనం మాత్రమే ఇస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 500 మంది జనాభాకు ఒక కార్మికుడు చొప్పున నియమించారు. అదే వర్కర్లతో 2021 జనాభాకు అనుగుణంగా సేవలందిస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం చూస్తే కార్మికులు ఎక్కువ ఉన్నారని చూపెట్టి బలవంతంగా కొన్ని చోట్ల తొలగించారు. అయితే, దశాబ్దాలుగా అదే పనిని నమ్ముకుని బతుకుతున్నవారు కొందరు మానేయడానికి ససేమిరా అన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఎవరిని తీసేయాలో అర్థం కాని పరిస్థితి. మధ్యేమార్గంగా వచ్చిన వేతనాన్ని సమపాళ్లల్లో పంచుకుంటున్నారు. పైకి చూడటానికి రూ.8500 వేతనం కనబడుతున్నప్పటికీ ఎక్కువ పంచాయతీల్లో దాన్ని పంచుకుంటుండటంతో ఒకొక్కరికి ఐదారువేలకు మించి రావడం లేదు. ఇచ్చే ఆ వేతనమూ నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్న పరిస్థితి. సంగారెడ్డి జిల్లా కృష్టారెడ్డిపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్, వలిగొండ మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు మూడు నెలలు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మల్టీపర్పస్ విధానంతో రోజూ 10,12 గంటలు పనిచేస్తున్న కార్మికులు మళ్లీ సర్పంచులు, వార్డుమెంబర్ల సొంత పనులనూ చేసిపెట్టాల్సి వస్తున్న పరిస్థితి. తమ మాట విననివారిపై సర్పంచులు, వార్డుమెంబర్లు, అధికారపార్టీ నేతలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. హన్మకొండ జిల్లా పరకాల మండలంలో కృష్టాపూర్లో తాను చెప్పిన మాట వినలేదనే కోపంతో జీపీ కార్మికున్ని అసభ్యంగా తిట్టి వేధిస్తున్న ఘటనా వెలుగులోకి వచ్చింది. అనేకమంది విధి నిర్వహణలో ప్రాణాలను సైతం కోల్పోయారు. ఎస్క్డే పథకం ద్వారా న్యాయం చేస్తామన్న సీఎం హామీ ఇంకా పూర్తిస్థాయిలో పట్టాలెక్కలేదు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడం లేదు.
పీఆర్సీలో మున్సిపల్ కార్మికులకు తీవ్ర అన్యాయం
రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో కలుపుకుని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాల్టీల్లో లక్ష మందికిపైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎస్ఎంఆర్, పార్ట్ టైం, ఫుల్ టైమ్ కార్మికులుగా, ఫి'-పే, టైమ్ స్కేల్, మల్టీపర్పస్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. గతంలో అన్ని పీఆర్సీల్లోనూ నిర్ణయించిన కనీసవేతనాన్ని వీరికి అమలు చేసేవారు. 8వ పీఆర్సీలో 3500, 9వ పీఆర్సీలో 6700, పదో పీఆర్సీలో 12వేలు అమలు చేశారు. ప్రస్తుత పీఆర్సీ కమిటీ కనీస వేతనాన్ని కేటగిరీల వారీగా రూ.19 వేలు, రూ.22,900, రూ.31,040 సిఫారసు చేసింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు. ఉన్న వేతనంపై 30 శాతం ఇస్తూ జీవో నెంబర్ 60 ప్రకటించడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఆ పెంచిన వేతనాన్ని కూడా ఇవ్వట్లేదు. గ్రేటర్ హైదరాబాద్ కార్మికులను ప్రత్యేక కేటగిరీలుగా గుర్తించి రూ.24 వేలు చెల్లించాలనే డిమాండ్‌నూ రాష్ట్ర ప్రభుత్వం పక్కన బెట్టింది. సమానపనికి సమానం వేతనమనే విధానం కూడా మున్సిపాల్టీల్లో అమలు కావట్లేదు. కారోబార్, బిల్కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలనీ, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, గ్రామ పంచాయితీ, మున్సిపల్ సిబ్బందినందరినీ పర్మినెంట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది.