Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుడు ఫోటోలు దిగారు... ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు
- తప్పులు సవరించాలంటే తాతలు కనిపించాల్సిందే
- అక్కరకు రాని సాఫ్ట్వేర్... తప్పుల తడకగా పోర్టల్
'ధరణి' ఏ టైంలో ఆ పేరు పెట్టారోకానీ, ప్రజల సహనం నశిస్తున్నా, సమస్యల పరిష్కారం మాత్రం సాధ్యం కావట్లేదు. కేంద్రం నుంచి వచ్చిన దాదాపు రూ.600 కోట్ల డబ్బులకు తక్షణం లెక్కలు చెప్పండంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తాఖీదు రాగానే, అప్పటికప్పుడు కండ్లు తెరిచి, హడావిడిగా ఓ సాఫ్ట్‌వేర్‌ను సృష్టించి...దానికి 'ధరణి' అని పేరుపెట్టి, 'అదే...ఇది' అని లెక్కకట్టించిన వైనం కండ్లముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. వ్యవస్థలో ఏదైనా లోపం ఉంటే ప్రభుత్వం కనీసం మూడు నెలల్లో దాన్ని పరిష్కరించి, ప్రజలకు సులభమైన మార్గాన్ని పరిచయం చేయాలి.
అదేంటో... ధరణి అమల్లోకి వచ్చి ఏడాది అవుతున్నా,
అప్పటి సమస్యలు ఇప్పటికీ అలాగే ఉండిపోయినరు.
ఎస్ఎస్ఆర్ శాస్త్రి
ధరణిలో దాదాపు 70 రకాల సమస్యలు ఉన్నట్టు ప్రజలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. మరి ఉద్దేశ్యపూర్వకమో, లేక చూద్దాంలే అనే సర్కారు సహజ నిర్లక్ష్యమో తెలీదు కానీ వాయిదాల పద్ధతిలో వాటిని పరిష్కరిస్తున్నట్టు 'అప్పుడప్పుడు' ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు ముఖ్యమంత్రి వరకు దీనిపై చేస్తున్న ప్రకటనలు పూర్తిగా సత్యదూరంగా ఉంటున్నాయి. లక్షల సంఖ్యలో దరఖాస్తులు కలెక్టర్ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అనేక రకాల భూములను ప్రభుత్వం వివాదాస్పదం చేయడంతో వాటిని అనుభవించలేక, అమ్ముకోలేక సొంతదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో 'ధరణి'పై చర్చాగోష్టి పెడితే, అక్కడికొచ్చిన బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో బాధ...సమస్య. మమ్మల్నెందుకు ఇబ్బందిపెడుతున్నారనేదే వారందరి ఉమ్మడి ప్రశ్న. నేలతల్లినే నమ్ముకొని సేద్యం చేస్తున్న చదువురాని రైతులే కాదు....సాఫ్ట్వేర్ ఇంజినీర్లూ 'ధరణి' దెబ్బకు విలవిల్లాడుతున్నారు. నాగర్‌కర్నూల్‌కు చెందిన గోగిరెడ్డి లక్ష్మారెడ్డి...సాఫ్ట్వేర్ ఇంజినీర్. మహేశ్వరం మండలంలో ధరణి తొలి లబ్దిదారుడు...బాధితుడు కూడా! ధరణి ప్రారంభించిన తొలిరోజు మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ మంఖాల్ రెవెన్యూ పరిధిలో గుంటన్నర భూమిని ఆయన కొనుగోలు చేశారు. 2020 నవంబర్ 4వ తేదీ స్లాట్ బుక్‌చేసుకొని, మహేశ్వరం తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అప్పటికప్పుడే మ్యూటేషన్ కూడా జరిగి, అమ్మినవారి భూమిలో నుంచి గుంటన్నర తగ్గి, అది గోగిరెడ్డి లక్ష్మారెడ్డి పేరుమీదికి బదిలీ అయ్యింది. దీంతో ధరణి సక్సెస్ అంటూ అక్కడి తహసీల్దారు జ్యోతి, ఆర్డీఓ సీహెచ్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ ఆర్ సునీతా అంద్యానాయక్, సింగిల్‌విండో చైర్మెన్ వెంకటేశ్వరరెడ్డి తదితరులు భూమి కొనుక్కున్న గోగిరెడ్డి లక్ష్మారెడ్డికి కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం అందచేశారు. మీడియాను పిలిచి ధరణి సూపర్ అంటూ మెచ్చుకోలు ప్రసంగాలు చేశారు. గోగిరెడ్డి లక్ష్మారెడ్డి తొలి పట్టాదారు పాస్‌బుక్‌ను అధికారుల నుంచి తీసుకుంటున్న ఫోటోలు, వీడియోలు మీడియాలో విస్త్రుతంగా ప్రసారం అయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కూడా 'ధరణి' అద్భుతం అంటూ సర్టిఫికెట్ ఇచ్చేశారు. సీన్ అక్కడికి కట్ చేస్తే...అధికారుల చేతుల మీదిగా పాస్‌బుక్ తీసుకున్న గోగిరెడ్డి లక్ష్మారెడ్డి సంతోషం కొంచెం సేపటికే ఆవిరైంది. పాస్‌బుక్‌లో ఆయన పేరు 'ళాఆ' అనీ, తండ్రిపేరు 'ఖృఈష్ణా' అని నమోదైంది. దీంతో బిత్తరపోయిన లక్ష్మారెడ్డి, అప్పటికప్పుడే తప్పును అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తప్పు సవరించుకోవాలంటే ఫీజు కట్టాలని చెప్పారు. దాన్నీ చెల్లించాడు. ఏడాదైంది...ఇప్పటివరకు ఆ సమస్య అలాగే ఉంది. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి, చెప్పులరిగేలా తిరిగితే, 8నెలల తర్వాత తండ్రి పేరు మాత్రం మార్చారు. సార్ మరి నా పేరో అని అడిగితే 'చూద్దాం' అంటున్నారు. ఇదే కాదు. అదే భూమికి స్లాట్‌ను బుక్‌చేసే క్రమంలో 2020 నవంబర్ 3వ తేదీ రూ.20,450 ఆన్లైన్లో కట్టి ఓ స్లాట్ బుక్ చేశారు. దానిలో సరిహద్దులు తప్పుగా రావడంతో, కాన్సిల్ చేసి మరో స్లాట్ బుక్ చేసుకున్నారు. ముందు బుక్ చేసిన స్లాట్‌లో డబ్బులు ఇప్పించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అతని డబ్బులు రీయింబర్స్ అయినట్టు మోబైల్ఫోన్కు మెసేజ్‌లు వస్తున్నాయే తప్ప, డబ్బులు ఖాతలో పడలేదు. సరిగ్గా ఇప్పటికి 11 నెలలు నిండాయి.
ఆయనకు ఫోన్లో మెసేజ్‌లు మిగిలాయే తప్ప, రీయింబర్స్ సొమ్ము, తప్పులు సవరించిన పట్టాదారు పాస్బుక్కు రెండూ రాలేదు. వీటి కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీపీఎల్ఏ, ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రి కేటీఆర్, మంత్రివర్గ ఉపసంఘం సహా అనేక మందికి తన సమస్యను విన్నవిస్తూ, మెయిల్స్ పంపారు. వాట్సాప్, ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. అందరూ వాటిని చూసారే తప్ప చేసిందేం లేదు. పట్టాదారు పాసుపుస్తకంలో పేరు తప్పుగా ఉండటంతో రైతుబంధు ఇవ్వట్లేదు. ఇదేంది సార్...సమస్యను పైనుంచి క్రింది వరకూ అధికారులందరికీ విన్నవించినా, ఏడాదిగా ఎవరూ ఎలాంటి పరిష్కారాలు చూపకుంటే ఇక ప్రభుత్వం ఎందుకు? అంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్ లక్ష్మారెడ్డి అమాయకంగా ప్రశ్నిస్తున్నాడు. ఇలాంటి సమస్యలు 'ధరణి'లో కోకొల్లలు. దానికి కలెక్టర్ కార్యాలయాల్లో బాధితులు ఇచ్చిన పిటీషన్లే సాక్ష్యాలు!