Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌కు అక్బరుద్దీన్ సూచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధులు, జ్వరాలు విజృంభిస్తున్నాయని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నగరంలోని ఫీవర్, నిలోఫర్ ఆస్పత్రిలో మౌలిక వసతుల కొరత వేధిస్తున్నదని తెలిపారు. అక్కడి సిబ్బంది దృష్టంతా కోవిడ్ వ్యాక్సినేషన్పైన్నే ఉందని చెప్పారు. అందువల్ల ఆ రెండు ఆస్పత్రులను ఒక్కసారి ఆకస్మికంగా తనిఖీ చేయాలని మంత్రి హరీశ్‌రావుకు సూచించారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అక్బరుద్దీన్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, పడకలు, ఐసీయూ, వెంటీలేటర్ల కొరత తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌లో గతంలో నిర్మించిన ఏరియా ఆస్పత్రి అన్యాక్రాంత మవుతున్నదనీ, దాన్ని ప్రభుత్వం వెంటనే తిరిగి ప్రారంభించాలని టీఆర్ఎస్ సభ్యుడు దానం నాగేందర్ కోరారు. సభ్యులు లేవనెత్తిన అంశాలకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సమాధానమిస్తూ... 2018, 2019తో పోలిస్తే ఇప్పుడు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసుల సంఖ్య పెరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. గతేడాది కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలు ఎక్కువ రోజులు ఇండ్లలోనే ఉండటంగో వాటి తీవ్రత తగ్గిందని వివరించారు. ఇప్పుడు మళ్లీ ఆయా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ఫీవర్, నిలోఫర్ ఆస్పత్రులను సందర్శించి రావాలంటూ శాసనసభా వేదికనుంచే ఆయన వైద్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఇప్పటి వరకూ కేవలం రూ.168 కోట్ల మేర మాత్రమే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. హైదరాబాద్‌లో దోమల నివారణ, నియంత్రణ కోసం త్వరలోనే జీహెచ్ఎమ్సీ, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేస్తామని హామీనిచ్చారు. ప్రశ్నోత్త రాల్లో అధికార పార్టీ సభ్యులు హర్షవర్థన్‌రెడ్డి, కాలె యాదయ్య, అజ్మీరా రేఖా నాయక్, దుర్గం చిన్నయ్య తదితరు లు... రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు దెబ్బతిన్న కల్వర్టులు, వంతెనల గురించి ప్రస్తావించారు. వాటికి త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని కోరారు. మహబూబ్‌నగర్‌లో జేపీ దర్గా నిధులతో నడుస్తున్న ఐటీఐని షాద్ నగర్‌కు మార్చాలంటూ టీఆర్ఎస్ సభ్యుడు అంజయ్య కోరారు. అలాంటి ప్రతిపాదనేదీ లేదంటూ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. అది ప్రయివేటు యాజమాన్యం పరిధిలో ఉన్నందున... సంబంధిత ప్రతిని ధులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే ఐటీఐని షాద్ నగర్‌కు మార్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన వివరిం చారు. దళిత బంధుకు సంబంధించిన అంశాలపై మంగళవారం లఘు చర్చను చేపడతామంటూ సభకు తెలిపిన స్పీకర్, వ్యవసాయ మంత్రి సింగిరెడ్ది నిరంజన్‌రెడ్డికి సభ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం... మధ్యాహ్న భోజన విరామాన్ని ప్రకటించారు.