Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'దిశ'పై సామూహిక లైంగికదాడి, దారుణ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ కమిటీ ముందు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హాజరయ్యారు. 2019, నవంబర్‌లో శంషాబాద్‌లో జరిగిన దిశ ఘటన కేసులో నలుగురు నిందితులు పోలీసుల ఎన్‌కౌం టర్లో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రేగిన అనుమానాల నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని వేసిన విషయం విదితమే. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షిరోర్కర్ నేతృత్వంలో జస్టిస్ రేఖా ప్రకాశ్, మాజీ ఐపీఎస్ అధికారి కార్తికేయ లతో కూడి త్రిసభ్య కమిటీ ఎన్కౌంటర్ ఘటనపై విచారణ జరుపుతున్నది. ఈ నేపథ్యంలో ఎన్‌కౌం టర్ జరిగిన సమయంలో సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్‌ను తమ ఎదుట హాజరుకావాలని విచారణ కమిటీ ఆదేశించింది. ఈ మేరకు త్రిసభ్య విచారణ కమిటీ ముందు సజ్జనార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్కౌంటర్ జరగడానికి గల కారణాలపై పలు ప్రశ్నలను సజ్జనార్‌కు కమిటీ వేసినట్టు తెలిసింది. ముఖ్యంగా, పోలీసుల నుంచి నిందితులు లాక్కొన్న ఆయుధంపై కాల్పులు జరిపిన నిందితుడి వేలిముద్రలు ఏమైనా సేకరించారా? అని కమిటీ ప్రశ్నించినట్టు తెలిసింది. వీటితో పాటు మరికొన్ని ప్రశ్నలు వేసిన విచారణ కమిటీ తిరిగి ఏడో తేదీన తమ ఎదుట హాజరు కావాలని సజ్జనార్‌ను ఆదేశించింది.