Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 వరకూ మార్కెట్ నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గడ్డిఅన్నారం మార్కెట్‌ను ఈ నెల 18 వరకూ వినియోగంలోనే ఉంచాలని హైకోర్టు ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మార్కెట్‌ను బాటసింగారంకు తరలించేందుకు అనుకూలంగా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన అప్పీల్ పిటిషన్లో సోమవారం డివిజన్ బెంచ్ మధ్యంతర ఆదేశాలిచ్చింది. బాటసింగారంలో మార్కెట్ నిర్వహణకు తగిన సౌకర్యాలు కల్పించనందున గడ్డిఅన్నారంలోనే ఈ నెల 18 వరకూ మార్కెట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఎవరైనా వ్యాపారులు ఇష్టపడితే బాటసింగారంలో వ్యాపారాలను నిర్వహించుకోవచ్చునని చెప్పింది. తదుపరి విచారణ ఈ నెల 18న చేస్తామనీ, అప్పటిలోగా బాటసింగారంలో చేసే ఏర్పాట్లపై సమగ్ర నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే మాదిరిగా రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిని కూడా రిపోర్టు అందజేయాలని కోరింది. ఈ మేరకు సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ వినోద్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులిచ్చింది.