Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగిందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శాసనమండలిలో సోమవారం తెలంగాణలో హరితహారంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2014 నుంచి 2017 వరకు రాష్ట్రంలో 3.67 శాతం అడవులు పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలో 24 శాతమున్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు 230 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం కన్నా ఎక్కువ నాటినట్టు తెలిపారు. హరితహారాన్ని ప్రజా ఉద్యమంగా రూపొందించామనీ, శాశ్వతంగా ఉండే విధంగా హరితనిధిని ఏర్పాటు చేశామని తెలిపారు. హరిత విద్యపై అవగాహన పెంచేందుకు రాష్ట్ర, జిల్లాకమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. హరితహారం కోసం ఇప్పటి వరకు రూ.6555.975 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. అటవీ విస్తీర్ణాన్ని పెంచే విషయంలో రాష్ట్రం, దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాకుండా ఇతర దేశాలతో పోటీ పడుతున్నదన్నారు. చైనా, బ్రెజిల్ తర్వాత ఈ విషయంలో తెలంగాణ ఉందని చెప్పారు. కోతులను తిరిగి అడవులకు పంపించేందుకు ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశామనీ, మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కోతులను ఆపకపోతే వ్యవసాయానికి ఇబ్బంది : టి.జీవన్ రెడ్డి
కోతుల దాడి నుంచి పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. వాటి పునరుత్పత్తిని ఆపేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. హరితహారంలో ఒకే రకమైన మొక్కలను కాకుండా పండ్లు, వెదురు మొక్కలను కూడా నాటేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.