Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లును శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ బిల్లును సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులు జాఫ్రీ, జీవన్‌రెడ్డి బిల్లుపై చర్చించారు. అనంతరం బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ చట్టం 2018లో కొత్త గ్రామాల ఏర్పాటు, గ్రామాల ప్రాంతాన్ని విస్తరణ, కుదింపు, పేరు, హద్దుల మార్పు తదితర విషయాలను ఆమోదించేందుకు, నోటిఫికేషన్ జారీ చ్ఱేసేందుకు వీలవుతుందని సభకు తెలిపారు. అలాగే చట్టంలోని 'ఎన్నికల ఖర్చు పద్దును దాఖలు చేయడంలో విఫలమైతే అర్హత కోల్పోయే' 23వ సెక్షన్‌ను సైతం సవరించే ప్రతిపాదనకు మండలి ఆమోదం తెలిపింది.
తెలంగాణ హౌజింగ్ బోర్డు (సవరణ) బిల్లు, 2021, కొండా లక్ష్మణ్ బాపూజీ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ (సవరణ) బిల్లును మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, 2021, నల్సార్ యూనివర్సిటీ(సవరణ) బిల్లును మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మండలిలో ప్రతిపాదించారు. వాటిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, అధికార పార్టీ సభ్యురాలు కల్వకుంట్ల కవిత, ఎంఐఎం సభ్యులు జాఫ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఇండ్లను కేటాయించాలి : అలుగుబెల్లి నర్సిరెడ్డి
రాష్ట్రంలో ఇది వరకే జెఎన్ఎన్ఆర్ యూఎం పథకం కింద నిర్మించిన ఇండ్లను వెంటనే కేటాయించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. అబ్దుల్లాపూర్ మెట్, మహబూబ్ నగర్ రహదారిలోనూ ఇలాంటి ఇండ్లు దశాబ్దానికి పైగా కేటాయింపులకు నోచుకోకుండా ఉన్నాయని తెలిపారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో వేగాన్ని పెంచాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణంలో బేస్ మెంట్ మరీ కిందికి ఉంటుండటంతో వర్షాకాలంలో నీరు ఇండ్లలోకి చేరే ప్రమాదముందని హెచ్చరించారు.
త్వరలోనే నిర్ణయం : వేముల
రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప, జెఎన్ఎన్ యూఆర్ఎం ఇండ్లపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.