Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొంతలేని లెక్కలు చెబుతున్నారు
- టీఎస్పీఎస్సీ కమిటీలో అన్యాయం
- జూనియర్ కళాశాలలకు డిగ్రీ, పీజీ కళాశాలలుగా మార్చాలి
- వక్ఫ్ భూముల్లో రెడెన్షియల్ భవనాలు నిర్మించాలి
- మైనార్టీ సంక్షేమంపై చర్చలో ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మైనార్టీ సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతున్నదని ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలపై సచార్ కమిటీ, సుధీర్ కమిటీలు అనేక సూచనలు చేసినప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదని చెప్పారు. మైనార్టీ సంక్షేమానికి కేటాయించిన నిధులు, ఖర్చు, రుణాల విషయంలో పొంతలేని అంకెలు చెబుతున్నారని విమర్శించారు. తద్వారా ఏం సాధిస్తారని అధికారులను నిలదీశారు. పబ్లిక్ అకౌంట్ కమిషన్ లెక్కలు ఒకలా, ఆర్టీఐ సమాచారం మరోలా ఉందని సభకు వివరించారు. పాత, కొత్త లెక్కలకు కూడా ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పారు. వీటిపై తాను చర్చకు సిద్ధమని చెప్పారు. ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ కమిషన్ సభ్యుల్లో ఒక్కరైనా ముస్లిం న్యాయవాది దొరకలేదా? అని ప్రశ్నించారు. ఎంతో మంది ముస్లింమేధావులు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు ఉన్నారని గుర్తు చేశారు. తమ డిమాండ్మేరకే షాదీముబాకర్ పథకాన్ని ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్...వీటన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తెలంగాణ ఇస్లామిక్ సెంటర్, ముస్లింల ఓవర్సిస్ స్కాలర్షిప్ను పట్టించుకోవడం లేదన్నారు. కోర్సులు చదవడం పూర్తయినప్పటకీ విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీలకు 204 రెసిడెన్షియల్ పాఠశాలలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారనీ, బాగా నడస్తున్నాయని చెప్పారు. ఈ విషయంలో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం ముస్లింలకు రావాల్సిన హక్కులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీ కార్పొరేషన్ నిర్వీర్యమైందనీ, వేల మంది రుణం కోసం దరఖాస్తులు చేసుకునప్పటకీ, నిధులు లేకపోవడంతో వాటిని పెండింగ్లో పెట్టారని చెప్పారు. ఒక్కరికీ రుణం ఇవ్వలేదని పేర్కొన్నారు. మైనార్టీ జూనియర్ కళాశాలను డిగ్రీ, పీజీ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయాలని కోరారు. జీఆర్ఎం, జీఎంఆర్టీ, టోఫెల్ పరీక్షల కోసం కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.