Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమె తరుపున రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలందజేసిన బీజేపీ నాయకులు
- ముందస్తు జాగ్రత్తలోనే సతీమణితో నామినేషన్ వేయించిన రాజేందర్
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
హుజూరాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీకి దిగుతున్నారు. ఈక్రమంలో ఆయన తన భార్య జమున పేరుతో సోమవారం ఒక సెట్ నామినేషన్ వేయించారు. ఆ పత్రాలను జమున తరుపున పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ నాయకులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆ నామినేషన్ అఫిడవిట్‌ను పరిశీలిస్తే ఈటల జమున ఆస్తుల మొత్తం విలువ రూ.43,47,05,894గా ఉంది. అందులో చరాస్తుల విలువ రూ.26,68,21,894 కాగా.. స్థిరాస్తులు రూ.14,78,84,000 విలు వజేసి ఉన్నాయి. ఆయా బ్యాంకుల్లో కలిపి అప్పులు రూ.4,89,77,978 వరకు అప్పులు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ఒక కారణంతో నేత నామినేషన్లు తిరస్కరణకు గురైతే అప్పుడు తమ భార్యను ఎన్నికల్లో అభ్యర్థిగా నిలుపుతారు. ఈ క్రమంలో బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముందస్తు జాగ్రత్తగా తన సతీమణి జమునతో నామినేషన్ దాఖలు చేయించారు. అయితే ఇదివరకే ఈటల రాజీనామా మర్నాడు నుంచి జమున వార్తల్లో నిలిచారు. కేంద్రంలోని అధికారపార్టీలోకి చేరిన ఈటల భవిష్యత్‌లో పార్లమెంట్‌కు వెళ్తారనీ, స్థానికంగా భార్య జమునను అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించేలా ప్లాన్ చేసుకుని ఆమెనే హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో నిలుపుతారన్న వార్తలు వచ్చాయి. ఆ మేరకు సంకేతాలు కూడా వచ్చాయి.