Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ శాఖ అధికారుల వర్క్‌షాపులో మంత్రి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అటవీ నేరాలను మరింత సమర్ధవంతంగా అదుపు చేసేందుకు రహస్య సమాచార నిధి (సీక్రెట్ సర్వీస్ ఫండ్) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. అందుకోసం 4.06 కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ కేటాయించారని తెలిపారు. అడవుల రక్షణ కోసం ఆక్రమణల నివారణ, వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్ అరికట్టడంపై సమాచారం ఇచ్చేవారిని ప్రోత్సహించేందుకు అటవీ శాఖ ఈ నిధిని వాడుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో (ఎంసీఆర్ హెచ్ఆర్డీ)లో సోమవారం పచ్చదనం పెంపు, గ్రీన్ ఫండ్, అటవీ పునరుద్దరణ, రక్షణ, ఆక్రమణల నివారణ, వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్ అరికట్టడం, అర్బన్ ఫారెస్ట్ పార్క్ ల వంద శాతం అభివృద్ధి పై వర్క్ షాప్ నిర్వహించారు. అటవీ అధికారులు ఐదు గ్రూపులుగా ఏర్పడి సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..ఫారెస్ట్ డివిజనల్ అధికారి నేతృత్వంలో రెండు నుంచి మూడు లక్షలు, జిల్లా అటవీ అధికారికి 3 నుంచి 7 లక్షలు, చీఫ్ కన్జర్వేటర్ కి 5 నుంచి 13 లక్షలు, పీసీసీఎఫ్ 50 లక్షలు ఈ నిధి నుంచి రహస్య సమాచారం విలువ ఆధారంగా ప్రోత్సాహకాలు అందించేలా నిబంధనలు పెట్టామన్నారు. పచ్చదనం పెంపు, పునరుద్ధరణకు సీఎం ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా అటవీ అధికారులు, సిబ్బంది బాధ్యత మరింత పెరిగిందనీ, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలకు అనుగుణంగా అటవీ శాఖ అధికారులు పని చేస్తూ, అడవులను రక్షించే బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలని ఆదేశించారు. ములుగు జిల్లాలో పులిని వేటాడిన ఘటన బాధాకరమనీ, భవిష్యత్ లో ఇలాంటివి జరుగకుండా చూడాలని నొక్కిచెప్పారు. సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ..అటవీ ఆక్రమణలను శాశ్వత నివారణ దిశగా సీఎం ఆలోచిస్తున్నారని, పోడు సమస్య పరిష్కారానికి చర్యలు మొదలయ్యాయని,తగిన రక్షణ చర్యలు, సిబ్బంది రేషనలైజేషన్ ద్వారా ఇది సాధ్యం అవుతుందన్నారు. అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. మంచి ఫలితాలు చూపెట్టాలని కోరారు. అవసరమైతే మరింత మంది సిబ్బంది నియామకానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. పీసీసీఎఫ్ ఆర్.శోభ మాట్లాడుతూ.. అటవీ శాఖకు సీఎం కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని కొనియాడారు. సీఎం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్ మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా దేశానికే ఆదర్శవంతంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తున్నామన్నారు.