Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక రోజు పాదయాత్రలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు
నవతెలంగాణ -నల్లగొండ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ నెల 8న తలపెట్టిన సార్వత్రిక సమ్మె ప్రభుత్వానికి గుణపాఠం కావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లాకేంద్రంలో సీఐటీయూ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చర్లపల్లి నుంచి ఇండిస్టియల్ ఏరియా పద్మానగర్ మీదుగా వివేకానంద విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రను చర్లపల్లిలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. 73 షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాల జీవోలను సవరించకుండా కార్మికులతో అతి తక్కువ వేతనాలకు వెట్టిచాకిరి చేయిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులపై దాడి పెరిగిందన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందనీ, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు ఎన్నో రెట్లు పెరిగినా.. కాలపరిమితి ముగిసిన 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్లో వేతనాలు మాత్రం పెంచలేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు వేతనాలు పెంచుకున్నారు తప్ప పరిశ్రమల కార్మికులకు ఒక్కపైసా వేతనం పెంచకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిస్టియల్ ఏరియాలో వలస కార్మికుల స్థితిగతులను వాళ్ల నివాస ప్రాంతాలను సందర్శించి తెలుసుకున్నారు. పద్మనగర్లో పవర్ లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి వారితో ముచ్చటించారు.
అనంతరం వివేకానంద విగ్రహం వరకు పాదయాత్ర సాగింది. అక్కడ నిర్వహించిన ముగింపు సభలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. నల్లగొండ పట్టణంలో పవర్లూమ్ వర్కర్స్ షాప్ గుమస్తాలు, షోరూం వర్కర్స్, మెకానిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్, హాస్పిటల్ వర్కర్స్, ఇంటి పని వాళ్లు.. ఇలాంటి 73 షెడ్యూలు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాల పెంపు కోసం ప్రభుత్వాలు జీవోలు సవరించాలని కోరుతూ ఈనెల 8న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెండెం రాములు, జిల్లా అధ్యక్షులు గంజి నాగరాజు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్, సీఐటీయూ, పవర్లూమ్ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.