Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగు చట్టాలు ఎంత ప్రమాదకరమో ఈ చిత్రంలో చూపారు
- చక్కని సినిమా తీసిన నారాయణమూర్తికి సీపీఐ(ఎం) అభినందనలు: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
'రైతన్న' ఓ చక్కని సందేశాత్మక చిత్రం, నూతన సాగు చట్టాలు రైతుకు ఎంత ప్రమాదకరమో ఈ సినిమా ద్వారా ఆర్. నారాయణమూర్తి సందేశమిచ్చారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చక్కని సినిమా తీసిన నారాయణమూర్తికి పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని వినోద థియేటర్లో ప్రదర్శితమవుతున్న 'రైతన్న' సినిమాను తమ్మినేని.. సీపీఐ(ఎం) శ్రేణులు, ఆర్.నారాయణమూర్తితో కలిసి సోమవారం మ్యాట్నీ షో చూశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంత నష్టాన్ని తలపెడతాయో తెలుసుకోవడంలో ప్రజల్లో కొంత అవగాహన లేమి ఉందన్నారు. అటువంటి గ్యాప్‌ను ఈ చిత్రం ద్వారా నారాయణమూర్తి పూడ్చారని తెలిపారు. చిత్రం చివర్లో ఓ అపోహ వచ్చే అవకాశం ఉందన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా తొలిసారి నిర్వహించిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి తనయుడు మంత్రి కేటీఆర్ సహా ఆ పార్టీ శ్రేణులు నిరసనలో పాల్గొన్నాయని తెలిపారు. ఆ తర్వాత సీఎం యూటర్న్ తీసుకున్నారన్నారు. ఇప్పుడు రైతు చట్టాలను అమలు చేయాల్సిందే అంటున్నారనీ, విద్యుత్ చట్టాన్ని వదిలేసుకున్నారని తెలిపారు. ఈ సినిమా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్న తొలిదశలో చిత్రీకరించారు కాబట్టి.. నాడు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలిపిన నేపథ్యంలో సీఎం పాత్రకు కొంత సానుకూలత కనిపించిందన్నారు. ప్రేమ, ఫైటింగ్‌లతో కూడిన కమర్షియల్ సినిమాలు వస్తున్న ప్రస్తుత తరుణంలో 'రైతన్న' లాంటి సందేశాత్మక చిత్రం తీయడం అభినందనీయమన్నారు. అభిమానులందించిన శాలువాతో నారాయణమూర్తిని తమ్మినేని సన్మానించారు.
అనంతరం 'రైతన్న' సినిమా దర్శకులు, కథానాయకుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. కార్పొరేట్‌కు వ్యవసాయాన్ని తాకట్టుపెట్టే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వామపక్షాలు చేస్తున్న పోరాటం అమోఘమని తెలిపారు. తన 'రైతన్న' సినిమాను ఆదరిస్తున్న వామపక్ష పార్టీల శ్రేణులు, రైతులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సాగు చట్టాలతో పాటు విద్యుత్ చట్టాలను కూడా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిందనీ, ఈ చట్టాలు అమలైతే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి స్కీంలు రద్దవుతాయని హెచ్చరించారు. రైతుల పట్ల ఏమాత్రం కృతజ్ఞత ఉన్నా మోడీ ఈ నల్లచట్టాలను రద్దు చేయాలని కోరారు. సినిమాను వీక్షించిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, భూక్యా వీరభద్రం, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు యర్రా శ్రీను, వై.విక్రం, నవీన్‌రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మొక్కా శేఖర్‌గౌడ్, జనరల్ సెక్రటరీ బోడా తావుర్యానాయక్, టీడీపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ కూరపాటి వెంకటేశ్వర్లు, నల్లమల రంజిత్ తదితరులు ఉన్నారు.