Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ ఘటనపై తమ్మినేని
- పోడు భూముల హక్కుపత్రాలిచ్చేందుకు షెడ్యూల్ ప్రకటించాలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతులను కారుతో తొక్కించి చంపిన బీజేపీ మంత్రులు పూర్తి బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. మూడు వ్యవసాయ నల్లచట్టాలను ఉపసంహరించుకోవాలనీ, ఎంఎస్పీ చట్టం చేయాలని గత 10 నెలలకుపైగా శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా 650 మంది రైతుల ప్రాణాలను బలితీసుకుందని విమర్శించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతుల మీదకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి తనయుడు ఆశీష్‌మిశ్రా, యూపీ ఉప ముఖ్యమంత్రి కాల్పులు జరిపి, కారుతో తొక్కించి నలుగురు రైతులను బలితీసుకున్నారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత సష్టించిన ఘర్షణలో మరో నలుగురు రైతులు మరణించారని పేర్కొన్నారు. అనేకమంది క్షత గాత్రులయ్యారని వివరించారు. నామమాత్రపు ఎక్స్ గ్రేషియో ప్రకటించి చేతులు దులుపుకుంటే సరి పోదనీ, మొత్తం ఎనిమిది మంది మరణానికి కారణ మైన ఆ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.గత నెలలో హర్యానాలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై లాఠీఛార్జీ చేస్తే ఒక రైతు మరణించారని గుర్తు చేశారు. దీనిపై హర్యానా ముఖ్యమంత్రి విలేకర్ల సమావేశం పెట్టి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో వందల మంది వాలంటీర్లు తయారై రైతులపై దాడి చేయాలని ప్రోత్సహిస్తూ మాట్లాడడా న్ని చూస్తే బీజేపీ రైతులపై చేస్తున్న కుట్రలను బట్ట బయలు చేస్తున్నదని విమర్శించారు. రైతుల మరణా లకు కారణమైన ఇద్దరు మంత్రులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపంసంహరించుకోవాలనీ, రైతుల ఆందోళనను విరమింపజేయాలని సూచించారు.
ఉద్యమాన్ని నీరుగార్చే ప్రకటనలు చేయొద్దు : సీపీఐ(ఎం)
అటవీ హక్కుల గుర్తింపు చట్టంలో పేర్కొన్న విధంగా 2005 డిసెంబర్ 13కంటే ముందు సాగు లో ఉన్న పోడు సాగుదారులందరికీ హక్కుపత్రాలి చ్చేందుకు కార్యాచరణతో కూడిన షెడ్యూల్‌ను తక్షణమే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. 2014 జూన్ 2వరకు తేదీని పొడిగించేందుకు చట్టసవరణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పం పాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం సోమవారం మరొక ప్రకటనలో సూచించారు. ముఖ్య మంత్రి ప్రకటించినట్టు అఖిలపక్ష పార్టీలను వారం రోజుల్లోపు ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లాలనీ, చట్ట సవరణ త్వరగా అయ్యేలా ఒత్తిడి తేవాలని కోరా రు. శతాబ్ధాలుగా అడవుల్లో ఉంటున్న గిరిజనులు, పేదల కు అటవీ భూములపై హక్కులు ఇవ్వాలని వామపక్ష పార్టీలు యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఆమోదం పొందిం దని గుర్తు చేశారు. 2005 డిసెంబర్ 13 కంటే ముందు సాగులో ఉన్న వారందరికీ 10 ఎకరాల లోపు హక్కుపత్రాలివ్వాలని చట్టంలో ఉందని పేర్కొ న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008 నుండి 2012 వరకు చట్టాన్ని అమలు చేసిందని తెలి పారు. తెలంగాణ పరిధిలో 13 లక్షల ఎకరాలకు హక్కులు ఇవ్వొచ్చని లెక్కలు తీసిందని వివరించారు. గ్రామసభల ద్వారా దరఖాస్తులను ఆహ్వానించిందని పేర్కొన్నారు. మొక్కుబడిగా అమలు చేసిన ఫలితంగా వేలాదిమంది దరఖాస్తులే పెట్టుకోలేదని తెలిపారు. అయినా 7,61,061 ఎకరాలకు 2,12,173 మంది దరఖాస్తులను పెట్టుకున్నారని వివరించారు. ఇందులో కేవలం 93,639 మందికి 3,00,284 ఎకరాలకు మాత్రమే హక్కుపత్రాలిచ్చా రని పేర్కొన్నారు. మిగిలిన 1,18,534 దరఖాస్తుల ను కారణాలు చూపకుండా తిరస్కరించారని తెలి పారు. తక్షణం చట్టంలో పేర్కొన్న విధంగా హక్కులు ఇవ్వాలని నెల రోజుల నుంచి అఖిలపక్ష పార్టీలు, గిరిజన, ప్రజాసంఘాలు ఉద్యమాన్ని ఉధృతం చేశాయని పేర్కొన్నారు. అందులో భాగంగానే మంగళవారం పోడు సమస్య ఉన్న ప్రాంతాల్లో సడక్‌బంద్/ రాస్తారోకో చేపట్టామని తెలిపారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ముఖ్యమంత్రి బూటకపు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.