Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం, ఏఐకెేఎస్సీసీ డిమాండ్
- రైతుల మృతికి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
నవతెలంగాణ-సిటీబ్యూరో/విలేకరులు
రైతులపై కాల్పులకు కారణమైన కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరుకుమార్ మిశ్రాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనీ, అతని కుమారుడు ఆశిష్ మిశ్రాను వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కన్వీనర్ టి.సాగర్ డిమాండ్ చేశారు. అక్టోబర్ 3న ఉత్తర్‌ప్రదేశ్‌లోని లకింపూర్ ఖేరిలో రైతులపై అమానుషమైన దాడికి నిరసనగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం, రాస్తారోకోలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. అందులో భాగంగానే హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజరుమిశ్రా రావాల్సిన మీటింగ్ స్థలం ఎదుట నిరసన తెలిపి తిరిగి వెళ్తున్న రైతులపై మంత్రి కుమారుడైన ఆశిష్‌మిశ్రా తన సహచరులు, గుండాలతో కలిసి దాడి చేసి, తమ వాహనాలను ఆమానుషంగా వారిపైకి ఎక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాకులతో కాల్పులు కూడా జరిపారన్నారు. 10 నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న రైతులపై ఈ రకమైన దాడులకు పాల్పడటం నీచమైన చర్య అన్నారు. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఈ రకమైన దాడులను ఖండించాలని పిలుపునిచ్చారు. ఏఐకేఎస్‌సీసీ కేంద్ర వర్కింగ్ గ్రూప్ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ.. ఈ దారుణకాండలో తుపాకీ గుండ్లకి ఒక రైతు, వాహనం దాడిలో మరో ముగ్గురు రైతులు మరణించారని అన్నారు. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసి, కనీస మద్దతు ధరల చట్టం సాధించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన మంత్రి, అతని కుమారుడు, వారి సహచరులను వెంటనే అరెస్ట్ చేసి హత్యానేరం కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీ నరసింహారావు, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాంనాయక్, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ.అబ్బాస్, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి రవికుమార్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రసాద్, సీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు ఝాన్సీ, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి సూర్యం, నాయకులు హన్మేష్, అరుణ, ఎస్ఎల్.పద్మ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం సుభాష్సెంటర్ వద్ద, మిర్యాలగూడ పట్టణంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. రైతుల మృతి ఘటనకు బాధ్యత వహిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం లింగాల గ్రామంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద, ఆర్మూర్, సిరికొండలలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట మంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్లకార్డులు చేబూని నిరసన తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్ర బస్టాండ్ ముందు జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి దిష్టిబొమ్మ దహనం చేశారు. నిర్మల్‌లో కొండా లక్ష్మణ్బా పూజీ విగ్రహం ఎదుట నోరుమూసుకుని, ముక్కుమీద వేలేసుకొని నిరసన తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో, జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు.